ఎవరో రావాలి… ఏదో చేయాలి..!అని కొందరు. రాజకీయాల్లోకి మేమా? మాకంత సీన్ లేదు. పైసలు కూడా లేవు.. కోట్లు పెట్టాలి.. కోట్లు రాబట్టాలి.. అని మరికొందరి యువతలో మెదిలే తలంపులివి. నేటి రాజకీయాలు అంతలా మలినమైనవి. అంతలా ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కేరళ ఎన్నికల గురించి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి యావత్ దేశాన్ని, ప్రపంచాన్ని ఆకర్షించి, ఆలోచింపజేసిన ఆష్నా గురించి. ఆష్నా.. కొట్టాయం దగ్గరి కులయెట్టికరలో జన్మించింది.
జర్నలిజంలో మాస్టర్స్ చేసిన ఆమెకు ఎలాంటి ఆర్థిక సపోర్టు లేదు. తన ఆస్తుల వివరాల అఫిడవిట్‌లో మొత్తం 84 రూపాయలే అని రాయడంతో అందరూ ఆమె వైపు చూశారు ఆసక్తిగా. చందాలు పోగేసి, స్నేహితుల సాయంతో రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయిన ఆమె ఎట్టుమనూర్ నుంచి సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీ నుంచి పోటీ చేసింది. ఓడుతానా గెలుస్తానా అనే చర్చకు తావే లేదు. ఎన్నికల్లో పోటీ అంటే ఇట్లనే ఉండాలా? ఇంతలా ఖర్చు చేసి ప్రచారం చేసుకోవాలా? ప్రజల్లో ఉంటేనే కదా వారి సమస్యలు తెలిసేది.
కార్లలో తిరుగుతూ ఎసీ రూముల్లో ఉంటే ఎట్లా తెలుస్తాయి? అని ఆమె నేటి యువతకు ఆదర్శపాఠాలు కూడా నేర్పింది. చిన్నపాటి సాయంతో ప్రచారం చేసుకుంటూ తాను గెలిస్తే ఆ నియోజకవర్గానికి ఏం చేస్తానో తెలియజేసి ప్రజా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసిందామె. ఆమె ప్రయత్నాన్ని చూసి చాలా మంది నవ్వుకున్నారు. సహజమే. ఎందుకంటే ఈనాటి రాజకీయాల పరిస్థితి, దుస్థితి చూసి కూడా ఆమె ఓ ముందడుగు వేసిందంటే మాములు విషయం కాదు.
మనకెందుకు ఆ గోల..? మన పని మనం చేసుకుంటే పోలా? అని నిస్తేజంలో ఉండే యువతకు ఆమె ఓ స్పూర్దిదాయకంగా నిలిచింది. ఆమె ఇంత మంది మనసు చూరగొని, ఇంత మందిని చేరగలిగిదంటే.. అక్కడే ఆమె రాజకీయాల్లో నైతికంగా విజయం సాధించినట్టు. గెలుపోటములు కాదిక్కడ సమస్య. చదువుకుంటే, అవగాహన పెరిగితే, ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉంటే.. రాజకీయాలు భ్రష్టు పట్టిపోలేదు. వాటిని అలా చేసింది మనమే. మార్చేది కూడా మనమే అని నిరూపించే క్రమంలో ఆష్మా ఓ అడుగు ముందుకేసింది.
అది ఓ చిన్న చర్యే కావొచ్చు. ఫలితం కూడా ఉండకపోవచ్చు. ఉండదనీ తెలుసు. కానీ ఎంతో మందికి స్పూర్తిని, నమ్మకాన్ని నింపింది. చదువు విలువ తెలుసుకుని.. సమాజాన్ని అవగాహన చేసుకుని.. ప్రజలతో మమేకమయితే చాలు రాజకీయాల్లో రాణించొచ్చని ఆమె కేరళలోని యువతకే కాదు యావత్ దేశానికే చెఎప్పింది. నేటి రాజకీయాల మార్పు కోసం ఆమె నేను సైతం అని ఓ ముందడుగేసి నిశ్శబ్దాన్ని చేధించింది. యువతలో నిస్తేజాన్ని పారదోలే ప్రయత్నం చేసింది. అందుకే ఆమెకంతా ఇప్పుడు ఆల్ దిబెస్ట్ చెబుతున్నారు. ఎన్నికల్లో ఆమె గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.