Income Scheme:స్థిరమైన ఆదాయం కోసం దేశంలో చాలా మంది బ్యాంక్ ఎఫ్‌డీలనే ఎంచుకుంటూ ఉంటారు. అయితే, ఒకటి రెండు బ్యాంకులు మినహా చాలా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ప్రస్తుతం 7 శాతం లేదా అంతకన్నా తక్కువగానే ఉన్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ బ్యాంకులు రెండేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.5% వడ్డీ ఇస్తుంటే… హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా ఇదే కాలపరిమితి గల డిపాజిట్లపై 7% వరకు వడ్డీ ఇస్తున్నాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 6.75% వడ్డీ మాత్రమే ఇస్తోంది. అయితే… మహిళలు, బాలికలకు వడ్డీ ఎక్కువ వచ్చేలా… బడ్జెట్లో కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని ప్రకటించారు. రెండేళ్ల పాటు అందుబాటులో ఉండే ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ద్వారా 7.5 శాతం వడ్డీ అందుకోవచ్చు. అంటే చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై అందించే వడ్డీ రేటు కన్నా… 0.5% నుంచి 1% ఎక్కువ వడ్డీ అందుకునే అవకాశం ఇప్పుడు ఉంది.
2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు రెండేళ్ల పాటు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పథకం అందుబాటులో ఉండనుంది. దీన్ని మహిళలు లేదా బాలికల పేరుపై మాత్రమే తీసుకోవాలి. ఇందులో అత్యధికంగా రూ.2 లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. 7.50% స్థిర వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎప్పుడైనా డబ్బు అవసరం పడితే పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన’ ఫారంలో
వ్యక్తిగత, ఆర్థిక, నామినేషన్ వివరాలు పొందుపరిచి… దరఖాస్తుతో పాటు గుర్తింపు, చిరునామా ధృవపత్రాలను ఇవ్వాలి. నగదు లేదా చెక్కు ద్వారా ఈ పథకంలో డిపాజిట్ చేస్తే… పెట్టుబడి పెట్టినట్లు సర్టిఫికెట్ ఇస్తారు.
‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పథకంలో గరిష్ట పరిమితి అయిన రూ.2 లక్షలను రెండేళ్ల పాటు పెడితే… ఏడాదికి 7.50% వడ్డీ చొప్పున మొదటి ఏడాది రూ.15,000… రెండో ఏడాది రూ.16,125.. మొత్తం రూ.31,125 వడ్డీగా పొందొచ్చు. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకం కాబట్టి… అసలు, వడ్డీ మొత్తాలకు భద్రత ఉంటుంది. ఎలాంటి నష్టభయం ఉండదు.