
Komuram Bheem Project : కొమురం భీం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువతోపాటు పిల్లకాలువల నిర్మాణం చేపట్టలేదని రైతులు వాపోయారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో 45 వేల 500 ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో అడ గ్రామం వద్ద కొమురం భీం ప్రాజెక్టును నిర్మించింది. రైతులకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరిగిందని వారు తెలిపారు.
ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందించలేదని.. వర్షంపైనే ఆధారపడి పంటలు పండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రాజెక్టు పై స్పందిస్తారనుకుంటే, ప్రాజెక్టు ప్రస్తావనే తీస్కురాలేదని మండిపడ్డారు. కేసీఆర్ కు కర్షకుల బాధలు పట్టవని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వం తమకు వద్దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. వర్షాల కారణంగా ప్రాజెక్ట్ ఆనకట్ట సైడ్ వాలు దెబ్బతినడంతో పడిపోయింది. ఆనకట్టకు 100 మీటర్ల వరకు పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టుకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆనకట్టను కాపాడుకోవడానికి ఇంజనీరింగ్ అధికారులు వరద తాకిడిని తట్టుకునేందుకు పాలితిన్ కవర్లను అమర్చారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.