Indian Ralway: రైలు పట్టాలు తప్పాలనే ఉద్దేశంతో ట్రాక్ మీద ఇనుప పైపును ఉంచిన ఓ 20 ఏండ్ల దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ పుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించిన అదుపులోకి తీసుకున్నారు. రైల్వే చట్టాల ప్రకారం అతడి మీద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ నెల 23న ముంబై లో ఈ ఘటన జరిగింది. హార్బర్ లైన్ పరిధిలోని ఖార్- శాంటాక్రూజ్ స్టేషన్ నడుమ 15 ఫీట్ల పొడవున్న మందమైన ఇనుప పైపును ఉంచారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని రైల్వే పోలీసులుకు వెళ్లడించారు. వెంటనే రైల్వే పోలీసులతో పాటు అధికారులు అక్కడికి చేరుకున్నారు. రైలు ప్రమాదం జరగాలనే ఉద్దేశంతోనే పట్టాల మీద ఇనుప పైపు పెట్టినట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఓ 20 ఏండ్ల యువకుడు ఈ పైపును ఉంచినట్లు గుర్తించారు. చివరకు నిందితుడిని అబ్దుల్ ఖాదిర్ సమద్ షేక్ గా గుర్తించారు.
నేరాన్ని అంగీకరించిన అబ్దుల్
అనంతరం అబ్దుల్ ఖాదిరన్ ను అరెస్టు చేసినట్లు బాంద్రా జీఆర్పీ సీనియర్ ఇన్ స్పెక్టర్ నందకుమార్ ఖడ్కికర్ తెలిపారు. ఈ ఘటన ఈ నెల 23న జరగగా, అదే రోజున నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. “నిందితుడు అబ్దుల్ మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. రైలు ప్రమాదం జరగాలనే ఆలోచనతోనే ఈ పనికి పాల్పడ్డాడు. ఈ పైపును దొంగతనంగా తీసుకొని వచ్చి, ట్రాక్ మీద అడ్డుగా పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశాం. అబ్దుల్ కూడా తాను నేరం చేసినట్లు అంగీకరించాడు. అతడి మీద రైల్వే చట్టంలోని సెక్షన్ 152, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 125 (ఎ) 126 (2), సెక్షన్ 329 (3) కింద అభియోగాలు మోపాం. ఆ తర్వాత అబ్దుల్ ను బాంద్రా కోర్టులో హాజరు పరిచాం. తడికి న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు” అని వెల్లడించారు.
Read Also: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, స్పెషల్ ట్రైన్ల టికెట్స్ బుకింగ్ షురూ!
కేంద్ర ప్రభుత్వం సీరియస్
గత కొంతకాలంగా దుండగులు రైల్వే ప్రమాదాలకు కారణం అవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పాలనే ఉద్దేశంతో రైల్వే ట్రాకులపై ఇనుప రాడ్డులు, సిలిండర్లు, ఇసుక కుప్పలు పోస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్ పరిసరాల్లోని ప్రజలను అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. రైల్వే ట్రాక్ ల మీద ఎవరైనా ఏవైనా వస్తువులను ఉంచినా, ఉన్నట్లు గుర్తించినా, వెంటనే రైల్వే పోలీసులకు లేదంటే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. దుశ్చర్యలకు పాల్పడి జీవితాన్ని ఆగం చేసుకోకూడదని యువతకు సూచిస్తున్నారు.
Read Also: కదులుతున్న రైల్లో నుంచి పడిపోయిన మహిళ, రైల్వే పోలీసులు ఏం చేశారంటే?