Railway News: రైలు ఆగిన తర్వాతే ఎక్కాలని రైల్వే పోలీసులు ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. రైలు కదులుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. అయినప్పటీ, కదులుతున్న రైలు ఎక్కేందుకు, దిగేందుకు ప్రయత్నిస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను చూస్తూనే ఉన్నాం. అదే, సమయంలో రైల్లో నుంచి పడిపోయే వారికి రైల్వే పోలీసులు కాపాడిన ఘటనలనూ చూశాం. తాజాగా అలాంటి ఘటనే యూపీలో జరిగింది. రైల్లో నుంచి పడిపోయిన ఓ మహిళను పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బయట ఉన్న బిడ్డను పిలుస్తూ బ్యాలెన్స్ తప్పిన మహిళ
ఓ మహిళ కాన్పూర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లేందుకు కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. తన బిడ్డతో కలిసి శ్రమ శక్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. సదరు మహిళ రైలు ఎక్కినప్పటికీ, ఆమె బిడ్డ ఇంకా ఎక్కలేదు. అప్పటికే రైలు కదలడంతో ఆమె కంగారుపడింది. తన పిల్లలను పిలిచేందుకు రైల్లో నుంచి బయటకు వంగింది. ఆమె ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. చేతులు జారడంతో రైలు, ఫ్లాట్ ఫారమ్ మధ్య గ్యాప్ లో పడిపోయింది. కదులుతున్న రైలు ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న రైల్వే సబ్ ఇన్ స్పెక్టర్ శివ్ సాగర్ శుక్లా, కానిస్టేబుల్ అనూప్ కుమార్ ప్రజాపతి చాకచక్యంగా వ్యవహరించారు. ఆమె కింద పడిన క్షణాల్లోనే చేతులు పెట్టుకుని పైకి లాగారు. ఈ ఘటన అంతా కేవలం 11 సెకెన్లలో జరిగింది.
Read Also: గుండెపోటుతో అల్లాడిన ప్రయాణీకుడు, టీటీఈ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు
రైలు వెంట పరిగెడుతూ మహిళను కాపాడిన పోలీసులు
ఈ ఘటనపై ఎస్సై శుక్లా కీలక విషయాలు వెల్లడించారు. “ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. శ్రమ శక్తి రైలు రైలులో స్టేషన్ కు వచ్చి ఆగింది. ముగ్గురు మహిళలు రైలు ఎక్కారు. అందులోని ఓ మహిళ బిడ్డ ఇంకా ఫ్లాట్ ఫారమ్ మీదే ఉంది. రైలు ముందుకు కదులుతుంది. వెంటనే ఆ మహిళ కేకలు వేయడం మొదలుపెట్టింది. వెంటనే నేను చూశాను. ఆమె కదులుతున్న రైలు డోర్ దగ్గరే నిలబడి బిడ్డ కోసం అరుస్తుంది. అదే సమయంలో ఆమె చేయి జారింది. రైలు, ఫ్లాట్ ఫారమ్ గ్యాప్ లో పడిపోయింది. రైలు కాస్త దూరం మందుకు లాక్కెళ్లింది. మేమూ కదులుతున్న రైలు వెంట పరిగెత్తాం. నేను, నా తోటి పోలీసు సిబ్బంది ఆమెను పట్టుకుని బయటకు లాగాం. తృటిలో ఆమెను ప్రాణాలతో కాపాడాం. ఈ ప్రమాదంలో ఆమెకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి” అని చెప్పారు. ఈ ఘటన అంతా రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రైల్వే అధికారులు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. రైల్వే పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?