CM Chandrababu Naidu: నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వియ్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా సీఎం వివిధ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలతో భేటీ అయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో కెప్పెల్ భాగస్వామ్యంపై ప్రధానంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెప్పెల్‌ను ఆహ్వానించారు. అలాగే ఏపీలో పెట్టుబడి అవకాశాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, సింగపూర్ కు చెందిన పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ (జీఐసీ) సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ బ్రాన్ యో తోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులపై ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఆపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.
ALSO READ: Indian Railway Notification: ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. రూ.44,900 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే
అలాగే, విల్మార్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్, సీఈవో క్వాక్ కూన్ హాంగ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు… సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎడిబుల్ ఆయిల్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్‌ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్‌లో సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా విల్మర్ టెక్నాలజీ అందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వివరించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని సీఎం చంద్రబాబు వివరించారు.
ALSO READ: Coolie Trailer: అయ్యయ్యో లోకేష్ నీకు ఇది తగునా.. పోస్టర్ కూడా కాపీ కొట్టాలా?
విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేశామని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని చెప్పారు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. 2026 జనవరి నాటికల్లా ప్రారంభం అయ్యే క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్ కంపెనీలు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలు పొందటంతో పాటు పరిశోధనలు చేయొచ్చని వెల్లడించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు.