సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో మరో 6 ప్లాట్‌ఫారమ్ లను మూసేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు నాలుగు నెలల పాటు ఈ షట్ డౌన్ కొనసాగుతుందని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులకు తాత్కాలికంగా అసౌకర్యం కలిగినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలిపారు. ఈ 6 ప్లాట్ ఫారమ్ ల మీదుగా రాకపోకలు కొనసాగించే సుమారు 60 రైళ్లను దారి మళ్లించబోతున్నారు. ఈ రైళ్లను చర్లపల్లి, కాచిగూడ సహా ఇతర స్టేషన్ల నుంచి నడిపించాలని నిర్ణయించారు. వీటిలో ఎక్కువ రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రయాణాలు కొనసాగించనున్నాయి.
క్రేన్ నిర్మాణం కోసం ప్లాట్ ఫారమ్స్ మూసివేత
ప్రస్తుతం మూతపడనున్న 6 ప్లాట్ ఫారమ్ ల స్థానంలో.. ముఖ్యంగా ప్లాట్ ఫారమ్ నంబర్లు 5, 6 మధ్య 500 టన్నుల సామర్థ్యం గల భారీ హెవీ డ్యూటీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్లాట్ ఫారమ్ ల మధ్య అంతరాన్ని ఇసుక బస్తాలతో నింపి, క్రేన్ సహాయంతో నిర్మాణ పనులు చేపడతారు. ఈ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ ప్లాట్ ఫారమ్ లను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసిందన్నారు.
రూ. 715 కోట్లతో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం
రోజు రోజుకు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి కోసం కేంద్రం రూ. 715 కోట్లు కేటాయించింది. కొద్ది నెలల క్రితమే పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చి వేసిన అధికారులు, దాని స్థానంలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు.
Read Also: కత్రా- శ్రీనగర్ రూట్ లో కస్టమైజ్డ్ వందే భారత్ రైళ్లు, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?
ఎయిర్ పోర్ట్ తరహా సౌకర్యాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు తరహా సౌకర్యాలతో అద్భుతంగా నిర్మిస్తున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్లుగా మల్లీ లెవల్ టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. ఏసీ వెయిటింగ్ లాంజ్ లు, ఫుడ్ కోర్డులు, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్ టెర్మినల్స్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణీకులు ఈజీగా తమ తమ ప్లాట్ ఫారమ్స్ దగ్గరికి వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, మెట్ల మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా రైళ్లకు సంబంధించిన రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు డిజిటల్ ఇన్ఫర్మేషన్ బోర్డులను అమర్చబోతున్నారు. స్టేషన్ అససరాలకు సరిపడ విద్యుత్ తయారు చేసుకునేందుకు సోలార్ ప్యానల్స్ అమర్చబోతున్నారు. స్టేషన్ కు ప్రయాణీకులు ఈజీగా రాకపోకలు కొనసాగించేలా.. కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీని తీసుకురాబోతున్నారు. వాహనాలను పార్క్ చేసేందుకు మల్టీలెవలర్ కార్ పార్మింగ్ తో పాటు ఇతర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: వావ్.. ఇది రైల్వే స్టేషనా? విమనాశ్రయమా? ఎంతబాగుందో!