Indian Railways: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. తొలిసారి కాశ్మీర్ లోయకు ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. జమ్మూలోని కత్రా, కాశ్మీర్ లోని శ్రీనగర్ నడుమ రోజుకు రెండు సర్వీసులను అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రెండు కస్టమైజ్ చేసిన వందే భారత్ రైళ్లను రెడీ చేశారు. ఈ రెండు రైళ్లు 8 కోచ్ లను కలిగి ఉంటాయి. జమ్మూకాశ్మీర్ లోని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రయాణం కొనసాగించేలా ఈ రైళ్లను తయారు చేశారు. “కాశ్మీర్ లోయకు రెండు స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక రైలు కత్రా నుంచి శ్రీనగర్ కు, మరో రైలు శ్రీనగర్ నుంచి కత్రా వరకు రోజు రెండు సర్వీసులు అందించనున్నాయి” అని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించాడు. ప్రయాణీకుల రద్దీ బట్టి ముమ్ముందు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
మూడు గంటల ప్రయాణం
కత్రా, శ్రీనగర్ మధ్య రైలు ప్రయాణం దాదాపు మూడు గంటలు పడుతుంది. ప్రస్తుతం కత్రా నుంచి శ్రీనగర్ కు నేరుగా రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జమ్మూ తావి రైల్వే స్టేషన్ ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునర్నిర్మాణం జరుపుకుంటున్నది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు రైల్వే సర్వీసులు పొడిగించనున్నారు. “అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జమ్మూ స్టేషన్ ను ప్రపంచ స్థాయి స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నారు. పని పూర్తయిన తర్వాత, రైల్వే సర్వీసులు విస్తరణపై నిర్ణం తీసుకుంటాం” అని దిలీప్ కుమార్ వెల్లడించారు.
కస్టమైజ్డ్ రైళ్ల ప్రత్యేకతలు ఇవే!
ఇక కత్రా- శ్రీనగర్ మధ్య సేవలు కొనసాగించే వందేభారత్ రైళ్లు ప్రస్తుతం దేశంలో సర్వీసులు అందిస్తున్న వందేభారత్ రైళ్లకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ రైళ్లు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఎలాంటి అవాంతరాలు లేకుండా నడుస్తుంది. ఇందుకోసం ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేశారు. ఈ రేక్‌ల రూపం సాధారణ LHB రేక్‌ల మాదిరిగానే ఉంటుంది. కానీ సాధారణ స్వింగ్ తలుపులకు బదులుగా ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. కోచ్ లలో వేడి సామర్థ్యాన్ని పెంచడం, వాటర్ ట్యాంకుల థర్మల్ ఇన్సులేషన్, బయో ట్యాంకులు, పైప్ లైన్లు, కుళాయిలలో వెచ్చని నీటి కోసం గీజర్లు లాంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి అత్యంత చలి వాతావరణంలో నీరు గడ్డకట్టకుండా నిరోధించడానికి, ఈ కోచ్ లలోని వాటర్ పైపు లైన్లలో సెల్ఫ్ రెగ్యులేటింగ్ హీటింగ్ కేబుల్స్, ఇన్సులేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోచ్ లను వెచ్చగా ఉంచడానికి అధిక సామర్థ్యం గల AC యూనిట్ ఏర్పాటు చేశారు. జమ్మూ-కాశ్మీర్ రూట్ లో నడిచే స్పెషల్ ట్రైన్ సెట్లను కపుర్తల ఆధారిత రైల్ కోచ్ ఫ్యాక్టరీతయారు చేసింది. త్వరలో ఈ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
Read Also: కత్రా-శ్రీనగర్ రైల్వే లింక్ ప్రారంభోత్సవం వాయిదా, కారణం ఇదే!