బూతు వీడియోలు షూట్ చేసి డబ్బులు సంపాదిస్తున్న ఓ ముఠాను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ ముఠాతో చేతులు కలిపి, విదేశీ వెబ్ సైట్స్ కి వీరు అడల్ట్ కంటెంట్ ని అమ్మేస్తున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో జరగడం విశేషం. మన రాష్ట్రంలో ఈ స్థాయిలో ఎవరికీ అనుమానం రాకుండా పోర్న్ కంటెంట్ సృష్టించడం సంచలనంగా మారింది.
వాటిలోనే అడల్ట్ కంటెంట్ ఎక్కువ..?
పోర్న్ సైట్స్ ని ఎప్పటికప్పుడు బ్యాన్ చేస్తున్నా.. ఏదో ఒక రూపంలో అడల్ట్ కంటెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై అందుబాటులో ఉంటూనే ఉంది. గతంలో యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు సర్కులేట్ అయ్యేవి. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా ఇన్ స్టా, ట్విట్టర్ కి తరలిపోయింది. అడల్ట్ కంటెంట్ ని చూడటానికి అలవాటు పడిన వారి మానసిక స్థితిని అంచనా వేయడం కష్టం. అలాంటి వారి వల్లే పసి పిల్లలపై దారుణాలు జరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సైకోల్లాగా మారడం, పర్వర్టెడ్ బిహేవియర్ తో విచ్చలవిడిగా ప్రవర్తించడం వీటి పర్యవసానాలు.
విదేశీ వెబ్ సైట్స్..
అశ్లీల వీడియోలను, వాటిని అప్ లోడ్ చేసే వెబ్ సైట్స్ ని, సోషల్ మీడియా హ్యాండిళ్లను పోలీసులు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఏపీలో దీనికి సంబంధించి ఈగల్ విభాగం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అడల్ట్ కంటెంట్ ని కలిగి ఉన్న వెబ్ సైట్స్ ని నిషేధించడంతోపాటు.. ఇలాంటి కంటెంట్ ని అప్ లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇప్పుడు ఇది మరో కొత్త రూపు సంతరించుకుంది. సైప్రస్ దేశానికి చెందిన ఓ వెబ్ సైట్ కి తెలుగు వీడియోలను ఓ ముఠా అమ్ముతోంది. స్థానికంగా కొంతమందిని లోబలరచుకుని, డబ్బు ఆశ చూపించి వారితో అశ్లీల వీడియోలను షూట్ చేస్తున్నారు. ఈ వీడియోలను సైప్రస్ కి చెందిన వెబ్ సైట్ నిర్వాహకులకు అమ్ముతున్నారు. ట్రాన్సాక్షన్లు అన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన ఈగల్ డిపార్ట్ మెంట్ పోలీసులు ఇటీవల ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
గుంతకల్లులో వీడియోలు..
గుంతకల్లుకు చెందిన లూయిస్ అనే వ్యక్తి స్థానికంగా కాల్ సెంటర్ నడుపుతూ కొంత మంది యువతులను ఆకర్షించేవాడు. వారికి అక్కడ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికి, వారిని ట్రాప్ చేసి అశ్లీల వీడియోలు చిత్రీకరించేవాడు. వాటిని సైప్రస్ లోని వెబ్ సైట్స్ కి అమ్మేస్తున్నాడు. ఆన్ లైన్ ద్వారా వచ్చే డబ్బుని లూయిస్ ఇక్కడ డ్రా చేసుకునేవాడు. ఉద్యోగాల పేరుతో మోసపోయిన యువతులు ధైర్యం చేసి బయటపడటంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది.
శ్రీకాకుళంలో కూడా..
ఈ ముఠాలో లూయిస్ తో పాటు శ్రీకాకుళానికి గణేశ్, జ్యోత్స్న అనే ఇద్దరి ప్రమేయం కూడా ఉందని పోలీసులు నిర్థారించారు. ఈ ముగ్గురు ముఠా అశ్లీల కంటెంట్ ని వెబ్ సైట్స్ కి అమ్ముతుందని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. బూతు వీడియోలు అప్ లోడ్ చేయడమే కాదు, చూడటం కూడా నేరంగానే పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు పోలీసులు. అలాంటి వీడియోలకు అలవాటు పడితే భవిష్యత్ అంధకారంగా మారుతుందని, నేర ప్రవృత్తి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. బూతు వెబ్ సైట్స్ పై ఉక్కుపాదం మోపుతామంటున్నారు ఈగిల్ డిపార్ట్ మెంట్ పోలీసులు.