Secunderabad Railway Station Redevelopment Works: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కీలక రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకుండా అధికారులు పలు రైళ్లు దారి మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లను చర్లపల్లి నుంచి దారి మళ్లించారు. తాజాగా మరో 9 రైళ్లను చర్లపల్లి మీదుగా రాకపోకలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ లో రద్దీని తగ్గించడంతో పాటు సజావుగా రైల్వే కార్యకలాపాలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ 9 రైళ్లకు చర్లపల్లి స్టేషన్ ను బోర్డింగ్, డీబోర్డింగ్ పాయింట్ గా మార్చారు.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు
సికింద్రాబాద్ నుంచి దారి మళ్లించిన రైళ్లలో సంబల్‌పూర్- నాందేడ్ – సంబల్ పూర్ ట్రై- వీక్లీ ఎక్స్ ప్రెస్(20809/20810) చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించనుంది. ఈ రైలు మౌలాలి బైపాస్ ద్వారా కామారెడ్డి వైపు ప్రయాణించనుంది. ఈ మార్పు ఏప్రిల్ 26 నుండి అమల్లోకి రానుంది. అటు విశాఖపట్నం – హెచ్‌ఎస్ నాందేడ్ – విశాఖపట్నం ట్రై-వీక్లీ ఎక్స్ ప్రెస్(20811/20812) కూడా ఏప్రిల్ 26 నుండి అదే దారిలో ప్రయాణాన్ని కొనసాగించనుంది. విశాఖపట్నం-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా చర్లపల్లి నుంచి నడవనుంది. అటు నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నర్సాపూర్ – నాగర్‌సోల్-నర్సాపూర్ బై-వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా చర్లపల్లి నుంచి నడవనున్నాయి. వాస్కోడగామా-జసిదిహ్-వాస్కోడగామా వీక్లీ ఎక్స్ ప్రెస్ ను కూడా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అటు మచిలీపట్నం- సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్ ప్రెస్ కూడా ఇకపై చర్లపల్లి నుంచి రాకపోకలను కొనసాగించనుంది. విశాఖపట్నం- LTT ముంబై- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ కూడా చర్లపల్లి నుంచి నడవనుంది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ ట్యూబ్, వేగం ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే అభివృద్ధి
ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి ఎయిర్ పోర్టులో మాదిరి సౌకర్యలో కేంద్ర ప్రభుత్వం పునర్నర్మిస్తోంది. రూ. 720 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. నార్త్, సౌత్ వైపున గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో మూడు అంతస్తులతో భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో రిటైల్ షాఫులు, కేఫేటేరియాలు, హోటళ్లు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ కు ఇరు వైపులా రెండు ట్రావెలేటర్లతో పాటు నడక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణీకుల కోసం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన ఫుట్ బ్రిడ్జ్ లు, ఓ స్కైవే నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ను స్కైవేతో కలుపనున్నారు. నార్త్ దిశగా నడక మార్గం నిర్మిస్తున్నారు. 5 వేల కిలో వాట్ల సామర్ద్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి, ఈ రైల్వే స్టేషన్ ను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: అలర్ట్, 26 రైళ్లు రద్దు.. మీరు వెళ్లే రైళ్లు ఉన్నాయేమో వెంటనే చెక్ చేసుకోండి!