Big Tv Live Original: ఆలోచనలే అద్భుతాలకు కారణం అవుతాయి. ఆలోచనలే పనికి రానికి వస్తువులను కూడా పనికి వచ్చేలా చేస్తాయి. ఓ రైల్వే అధికారి చేసిన ఆలోచన ఇప్పుడు ఎంతో మంది రైల్వే కార్మికులు, వారి కుటుంబాలకు అత్యవసర వైద్యసాయం అందిస్తున్నది. మహారాష్ట్ర భూసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఇతి పాండే, మారుమూల ప్రాంతాలలోని రైల్వే కార్మికులు, వారి కుటుంబాలకు వైద్యసాయం అందించేందుకు ‘వీల్స్ ఆన్ హాస్పిటల్’కు శ్రీకారం చుట్టారు. ఈ వైద్యశాల ఇప్పుడు రైల్వే కార్మికుల పాలిట సంజీవినిగా మారింది. ఇంతకీ ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఎలా అమలు చేసింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వే కార్మికులకు వైద్య సేవలు
మహారాష్ట్రలోని భూసావల్ లో చాలా మంది రైల్వే కార్మికులు నివసిస్తారు. ఇక్కడ మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉంటాయి. సరైన వైద్య సదుపాయం కూడా అందుబాటులో లేదు. మారుమూల ప్రాంతాలలో నివసించే రైల్వే కార్మికులు, వారి కుటుంబాలు అత్యవసర వైద్యం కావాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇతి పాండే ఎలాగైనా ఇలాంటి రైల్వే కార్మికుల కుటుంబాలకు వైద్య సాయం చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ‘వీల్స్ ఆన్ హాస్పిటల్- రుద్ర’ను రూపొందించారు. ఈ ట్రైన్ హాస్పిటల్ ఇప్పుడు కార్మికుల ఇంటికే వెళ్లి వైద్య సాయం అందిస్తోంది. గాయపడిన కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు రుద్రను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇతి పాండే తెలిపారు. తమ డివిజన్ పరిధిలోని 25 వేలకు పైగా కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సాయం అందించడమే ఈ హాస్పిటల్ లక్ష్యం అన్నారు. ఈ ‘వీల్స్ ఆన్ హాస్పిటల్- రుద్ర’ 15 రోజులకు ఓసారి మారుమూల రైల్వే డివిజన్ల గుండా తిరుగుతుంది. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల వైద్య పరీక్షలు అందిస్తున్నారు ఇందులోని డాక్టర్లు.
పనికి రాదని పక్కన పెట్టిన కోచ్ లో హాస్పిటల్ ఏర్పాటు
‘వీల్స్ ఆన్ హాస్పిటల్- రుద్ర’ను తయారు చేయడానికి ఇతి పాండే మొదట్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మెకానికల్ డిపార్ట్ మెంట్ పాత కోచ్ ను బయటకు ఇవ్వడం చాలా కష్టం అన్నారు. కానీ, కొన్ని వేల మంది కార్మికులకు మేలు చేసే ఈ ఆలోచన నచ్చడంతో అధికారులు ఓకే చెప్పారు. ముంబైలోని మాతుంగా సెంట్రల్ రైల్వే వర్క్ షాప్ నుంచి భుసావల్ కు పాత కోచ్ ను పంపారు. పాత 3-AC రైలు కోచ్ ను పూర్తిగా పనిచేసే మొబైల్ మెడికల్ యూనిట్ గా మార్చారు. కోచ్ లోని బేర్ ఫ్రేమ్ ను తొలగించారు. చెక్క ప్యానలింగ్, కొత్త ఫ్లోరింగ్ అమర్చారు. ECG యంత్రం, రక్త సేకరణ సౌకర్యాలు, సహా అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను కల్పించారు. మహిళా రోగులకు గైనకాలజికల్ పరీక్షను కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. రైల్వే హాస్పిటల్ లోని టీమ్ తో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. రుద్రలో వైద్యసాయం పొందే ప్రతి ఒక్కరికి ID ఇస్తారు. దీని ద్వారా భూసావల్ డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో లేదంటే రుద్ర తదుపరి శిబిరంలో చికిత్సను పొందే అవకాశం ఉంటుంది.
రుద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు
ఇక రుద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు రైల్వే అధికారులు. జననవరి 18 చాలిస్ గావ్ లో మొదటి వైద్య శిబిరం జరిగింది. ఒక రోజులోనే 159 మంది ఉద్యోగులు, 72 మంది కుటుంబ సభ్యులు, 25 మంది రిటైర్డ్ కార్మికులు సహా 259 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అత్యవసర చికిత్స అవసరం అనుకున్న వారికి రైల్వే ప్రధాన ఆసుపత్రిలో చేరేలా రుద్ర వైద్య బృందం చర్యలు తీసుకుంటున్నది. రెండో శిబిరం, జనవరి 30న ముర్తిజాపూర్‌లో జరిగింది. అక్కడ దాదాపు 291 మంది రైల్వే సిబ్బంది వైద్య పరీక్షలను చేయించుకున్నారు. మున్ముందు రుద్ర వైద్య సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఇతి పాండే తెలిపారు. కంటి, దంత సేవల కోసం మరో కోచ్ ను రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎవరీ ఇతి పాండే?
భారతీయ రైల్వే 26 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న అధికారి ఇతి పాండే. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో గోల్డ్ మెడల్ సాధించింది. భూసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ముంబైలోని వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వేతో సహా వివిధ విభాగాలలో సేవలందించారు.
Read Also: రైలు నుంచి బాటిళ్లు బయటకు విసురుతున్నారా? ఎంత ప్రమాదకరమో చూడండి!