Air India Flight: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం జైపూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. హైజాకింగ్ భయాల మధ్య ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హైజాక్ జరిగినప్పుడు ఉపయోగించే కోడ్ను పైలట్ ఏటీసీకి పంపారు. దీంతో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి ఢిల్లీకి వస్తోంది ఎయిర్ ఇండియాకు చెందిన AI2030 గల విమానం. అది భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత హైజాకింగ్ భయాలు తలెత్తాయి. హెచ్చరిక తర్వాత ఢిల్లీకి బదులుగా జైపూర్లో అత్యవసరంగా విమానాన్ని దించాలని పైలట్ నిర్ణయించాడు. దీంతో ఆ విమానం జైపూర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండైంది.
విమానాశ్రయంలో దిగిన వెంటనే కార్యాచరణ విధానాల ప్రకారం దర్యాప్తు చేపట్టారు. విమానం దిగడానికి ముందు అక్కడ కార్యకలాపాలు జరిగాయి. ఆ సమయంలో అన్నిరకాల భద్రతను ఏర్పాటు చేశారు. విమానం నిజంగా హైజాక్ చేయబడిందా? మరేదైనా ప్రమేయం ఉందా? అనేది ఇంకా తెలియాల్సివుంది. అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు హెచ్చరిక అందిన తర్వాత విమానం జైపూర్లో సురక్షితంగా ల్యాండైంది.
ప్రస్తుతం ఆ విమానాన్ని భద్రతా తనిఖీలు చేస్తున్నారు. హెచ్చరికకు దారితీసిన పరిస్థితుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. స్క్వాక్ 7500 అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఏవియేషన్ ట్రాన్స్పాండర్ కోడ్. విమానం హైజాక్ ఐనప్పుడు లేదా చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకున్నప్పుడు, పైలట్లు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను రహస్యంగా అప్రమత్తం చేయడానికి ఈ కోడ్ ఉపయోగిస్తారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ALSO READ: జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!
విమానంలోని ప్రయాణీకులకు భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉగ్రవాద నిరోధక దళం, ఇతర భద్రతా సంస్థల బృందాలు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అలాగే జాతీయ భద్రతా దళం బృందాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు సమాచారం. ఆగస్టులో జరిగిన ఇలాంటి ఘటన జరిగింది. సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలోని బాత్రూంలో ‘బాంబ్’ అనే పదం రాసి ఉన్న టిష్యూ పేపర్ దొరికింది. వెంటనే ఆ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండైన విషయం తెల్సిందే.