దీపావళి, ఛత్ పూజ పండుగల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు అన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే, వీరిలో పలువురు టికెట్ లేకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ లేని రైల్వే ప్రయాణంపై సౌత్ సెంట్రల్ రైల్వే ఉక్కుపాదం మోపుతోంది. రద్దీని వేళ తాజాగా ఒక రోజంతా(అక్టోబర్ 13న)ఇంటెన్సివ్ టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించింది. ఈ చెకింగ్స్ లో టికెట్ లేకుండా, సక్రమంగా ప్రయాణించని సుమారు 16,105 మందికి జరిమానా విధించారు రైల్వే అధికారులు. వీరి నుంచి ఏకంగా రూ. 1.08 కోట్లు వసూళు చేశారు.
ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆధ్వర్యంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ లోని ఆరు డివిజన్లలో ఈ ప్రత్యేక చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు. సికింద్రాబాద్ జోన్ లో ఒకే రోజు సగటు 9, 500 కేసులు నమోదు కాగా, ఆదాయం దాదాపు రూ. 47 లక్షలు వచ్చింది. టికెట్ చెకింగ్ ఆదాయం ఒకే రోజు రూ. 1 కోటి దాటడం ఇదే మొదటిసారి. గతంలో అక్టోబర్ 6న అత్యధికంగా రూ.92.40 లక్షలు వచ్చాయి. తాజాగా జరిమానాల్లో విజయవాడ డివిజన్ అత్యధికంగా రూ. 36.91 లక్షల టికెట్ చెకింగ్ ఆదాయాన్ని అందించింది. ఆ తర్వాత గుంతకల్ డివిజన్ నుంచి రూ. 28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్ రూ. 27.9 లక్షలు, గుంటూరు డివిజన్ రూ. 6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్ రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్ రూ.4.08 లక్షలు వచ్చాయి.
ఈ టికెట్ చెకింగ్ డ్రైవ్ గురించి రైల్వే అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. నిజమైన ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంతో పాటు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లలోని రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ కోచ్ లలో టికెట్ లేని, సాధారణ ప్రయాణాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణించడం వల్ల కలిగే చట్ట పరమైన ఇబ్బందుల గురించి ప్రయాణీకులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.
Read Also: ఇది ప్రపంచంలోనే మోస్ట్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ, ఏకంగా 13 దేశాలను చుట్టేస్తుంది!
అటు దీపావళి వేళ రైళ్లలో మండే, పేలుడు పదార్థాలు, బాణసంచా క్రాకర్లను తీసుకెళ్లవద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను కోరింది. నిబంధనలు ఉల్లంఘించి తీసుకెళ్తే రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష, లేదంటే రెండూ విధించబడే అవకాశం ఉందన్నారు. రైళ్లలో అలాంటి వస్తువులను తీసుకెళ్లడం వల్ల ప్రయాణీకుల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. రైళ్లలో, స్టేషన్లలో ఏదైనా అనుమానాస్పద, ప్రమాదకరమైన, మండే పదార్థాలను గమనించినట్లయితే ప్రయాణీకులు సమీపంలోని రైల్వే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.