AP Highway Projects: రైతు పాదాల నుంచి రేస్ కార్ చక్రాల వరకూ… రోడ్లు చెప్పే అభివృద్ధి కథలు ఎన్నో. ఇప్పటి వరకూ “అమెరికా స్టాండర్డ్” అంటే అది మనల్ని తక్కువగా చూస్తున్నదన్న భావన మన లోపలెక్కడో ఉంది. కానీ ఇప్పుడు ఆ భావనకే చెక్ పెట్టేలా ఉంది మన ఆంధ్రప్రదేశ్! ‘‘ఇక్కడి రోడ్ల స్థాయికి అమెరికా తప్ప మరెవ్వరూ పోటీ కాదు’’ అనే స్థాయికి చేరుకుంటోంది రాష్ట్ర రహదారి వృద్ధి. ఇది ఖాళీ మాట కాదు – వెనక బలమైన ఫాక్టులు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, భారీ లైన్ మార్గాలు, స్పెషల్ హైవేలు అన్నీ కలిసి… మన రోడ్లను గ్లోబల్ గేర్‌లోకి దించేస్తున్నాయి.
ఒకప్పుడు మన రాష్ట్ర రోడ్లు ఏమీ బాగాలేవే! అనే కామెంట్లు ఓ మామూలే. కానీ ఇప్పుడు ఆ మాటలు తక్కువవుతున్నాయి. ఎందుకంటే ఏపీ రోడ్డు రంగంలో ఓ విప్లవాన్ని చూస్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్నాయి. వాటన్నింటి వెనుక కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన హామీ ఉంది. అదేమిటంటే.. ఇంకో రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు అమెరికాలోని హైవేల మాదిరిగా తయారవుతాయన్న హామీనే.
ఈ మాటల్ని నిజం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రోడ్డు మార్గాలు కేవలం వాహనాలకు మాత్రమే కాదు.. వ్యాపారానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఉద్యోగావకాశాలకు అన్నింటికీ బలం ఇస్తాయి. ఈ విషయంలో గడ్కరీ ప్రకటించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఇవే.
హైదరాబాద్ – విజయవాడ రహదారి (6 లేన్లు) – రూ. 6,700 కోట్లు
విజయవాడ – మచిలీపట్నం రహదారి (6 లేన్లు) – రూ. 2,600 కోట్లు
వినుకొండ – గుంటూరు (4 లేన్లు) – రూ. 2,605 కోట్లు
గుంటూరు – నిజాంపట్నం (4 లేన్లు) – రూ. 2,000 కోట్లు
బుగ్గకయిప – గిద్దలూరు (4 లేన్లు) – రూ. 4,200 కోట్లు
ఆకివీడు – దిగమర్రు (4 లేన్లు) – రూ. 2,500 కోట్లు
పెడన – లక్ష్మీపురం (4 లేన్లు) – రూ. 4,200 కోట్లు
ముద్దునూరు – కడప (4 లేన్లు) – రూ. 1,182 కోట్లు
ఇది తలపెట్టిన ప్రాజెక్టుల ఓ చిన్న లిస్టే. అలాగే, హైదరాబాద్ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కూడా మంజూరు లభించింది. ఈ మార్గం పూర్తిగా కొత్తది. ఇప్పటి రూట్ కంటే వేగంగా ప్రయాణించేందుకు, ట్రాఫిక్‌ను మళ్లించేందుకు కీలకం. ఇది పూర్తి కాగానే హైదరాబాద్ నుంచి విజయవాడకు 3 గంటలలోపే చేరడం సాధ్యమవుతుంది.
Also Read: Pushkaralu Trains: పుష్కరాలకు 40 లక్షల భక్తుల అంచనా.. స్పెషల్ ట్రైన్స్ రంగంలోకి.. ఎప్పుడంటే?
లక్ష్యం ఇదే..
ఈ మార్గాల అభివృద్ధితో రాష్ట్రానికి లాభాలు ఎన్నో. రైతులు తమ పంటను వేగంగా మార్కెట్‌కి చేరుస్తారు. పారిశ్రామిక సంస్థలు సరుకు రవాణాలో సమయాన్ని ఆదా చేస్తాయి. విదేశీ పెట్టుబడిదారులు కూడా వేగవంతమైన కనెక్టివిటీకి ఆకర్షితులవుతారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దారి మధ్య ఉన్న చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా అభివృద్ధి బాటలోకి వస్తాయి. టూరిజం రంగానికి ఇది బూస్ట్ లాంటిది.
అమెరికా కంటే మెరుగ్గా..
సాధారణంగా మనం అమెరికా లెవెల్ అంటే ఒక మెట్టుపై చూసే మాట. కానీ ఇప్పుడు ఆ లెవెల్‌ను మనం అందుకోవడమే కాకుండా కొన్ని అంశాల్లో మించిపోయేలా నిర్మాణాలు చేస్తున్నామని గడ్కరీ స్పష్టంగా చెప్పారు. నాణ్యత విషయంలో రాజీ లేదు, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇక్కడే అసలు విషయం అమెరికా స్టాండర్డ్‌కి సమానంగా మారాలని కాదు.. మన రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడం లక్ష్యం. ఒక్కొక్క రహదారి ప్రాజెక్టు వెనుక ఉన్న కృషి, ఖర్చు, లక్ష్యాలన్నింటినీ చూస్తే ఇది కేవలం రోడ్డు అభివృద్ధి కాదు, ఇది రాష్ట్ర ప్రగతికి వేసిన దారి అంటున్నారు విశ్లేషకులు!