AP Tourism Jungle Safari: అడవిలో ప్రకృతి ఒడిలో.. రంగురంగుల పూల మధ్య వేల సంఖ్యలో సీతాకోకచిలుకలు లక్షల్లో విహరించడం చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఆ అనుభూతిని నిజం చేసుకునే అవకాశం వచ్చింది. ఎన్‌టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో జంగిల్ సఫారీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అడవిలో 14 కిలోమీటర్ల పర్యాటక రూట్‌ను ఏర్పాటు చేసి, పర్యాటకులకు ప్రకృతి కడుపులో ఓ అద్భుత ప్రయాణం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
బటర్‌ఫ్లై పార్క్ నుంచి కొండపల్లి అంజనేయ స్వామి ఆలయం వరకు సఫారీ
ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న ఈ జంగిల్ సఫారీ మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ నుంచి కొండపల్లి అంజనేయ స్వామి ఆలయం వరకు ఉంటుంది. ఇది సుమారు 14 కి.మీ పొడవైన అడవి మార్గం. పచ్చని చెట్లు, అడవి తీరుపై ఉన్న ప్రకృతి శబ్దాలు, అడవిలో సంచరించే పక్షులు, జంతువులతో ఇది పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
సఫారీ టికెట్ ధర కేవలం రూ.300 మాత్రమే
ఈ జంగిల్ సఫారీలో పాల్గొనాలంటే ప్రతి వ్యక్తికి టికెట్ ధర రూ.300. మొదటివిడతగా రెండు ప్రత్యేక వాహనాలు ట్రయల్ రన్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన తరువాత పర్యాటకులకు ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఫారెస్ట్ శాఖ వాహనాల్లోనే సురక్షితంగా, గైడ్‌లు సహాయంతో ఈ ప్రయాణం సాగుతుంది.
ఇక్కడి సీతాకోకచిలుకల పార్క్ విశేషాలు తెలుసా?
మూలపాడు బటర్ ఫ్లై పార్కు గురించి తెలుసుకుంటే.. పర్యాటకులు సందర్శకులు ఒక్క క్షణం ఆగలేరు. ఈ పార్టీ ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 160 కు పైగా రకాల సీతాకోకచిలుకలు, అనేక రకాల పుష్పవృక్షాలు, బర్డ్ వాచ్ టవర్స్, కిడ్స్ నేచర్ జోన్, పర్యావరణ శిక్షణ కేంద్రం వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఈ పార్క్ ఉంటుంది. ఇక్కడ సీతాకోకచిలుకలు పూల ముంగిట తిరుగుతూ, పర్యాటకులకు వర్ణించలేని ఆనందాన్ని ఇస్తాయి.
భవిష్యత్తులో జూ కూడా..
ఇక్కడితో కాదండీ.. మూలపాడు పరిసరాల్లో 200 నుండి 300 ఎకరాల విస్తీర్ణంలో జూ ఏర్పాటు చేసే ప్రణాళికను అటవీ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రాథమిక సర్వే కూడా పూర్తైంది. జింకలు, చిరుతపులులు, నెమళ్లు, పావురాలు వంటి అడవి జంతువులను ఇందులో ఉంచే ఆలోచనలో ఉన్నారు.
కొండపల్లి అంజనేయ స్వామి ఆలయం
సఫారీ రూట్ చివరగా వచ్చే అంజనేయ స్వామి ఆలయం కూడా ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం కొండపల్లి అడవుల్లోని కొండపై ఉంది. అడవిలో 14 కిలోమీటర్ల సఫారీ తర్వాత ఈ ఆలయానికి చేరుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది. ఈ విధంగా ఆధ్యాత్మికత, ప్రకృతి అనుభవం ఒకేసారి లభిస్తుంది.
ఇది కేవలం సఫారీ కాదు.. ప్రకృతి పాఠశాల
ఈ సఫారీ ద్వారా చిన్నారులు, విద్యార్థులు ప్రకృతితో ఎలా జీవించాలో తెలుసుకుంటారు. ప్రకృతి పరిరక్షణ, అడవులలో జీవజాతుల పరిరక్షణపై అవగాహన పెరుగుతుంది. ఫోటోగ్రఫీ ప్రియులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడ తమ కెమెరాలతో అద్భుత దృశ్యాలను బంధించవచ్చు.
Also Read: Railway track marriage: రైలు పట్టాలకు పెళ్లి.. ఇక్కడ ఇదో వెరైటీ.. వీడియో వైరల్!
స్థానికులకూ ఉపాధి.. పర్యాటకానికి ఓ కొత్త నాంది
ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. గైడ్‌లు, డ్రైవర్లు, టికెట్ కౌంటర్లు, హోటళ్లు, హోం స్టేలు వంటి రంగాలలో ఉపాధి పెరుగుతుంది. దీంతో గ్రామీణ ప్రాంత అభివృద్ధికీ ఇది తోడ్పడుతుంది.
ఎక్కడ ఉంది ఈ సీతాకోకచిలుకల లోకం?
మూలపాడు బటర్‌ఫ్లై పార్క్, ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లాలో విజయవాడకు సుమారు 25 కి.మీ దూరంలో, కొండపల్లి అడవి ప్రాంతంలో ఉంది. నేషనల్ హైవేకు సమీపంలో ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు బాగున్నాయి. విజయవాడ నుండి కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో ప్రారంభమయ్యే ఈ జంగిల్ సఫారీ.. పర్యాటకులకు ప్రకృతితో మమేకమయ్యే అరుదైన అవకాశం. రంగురంగుల సీతాకోకచిలుకలు, అడవి జీవులు, ఆధ్యాత్మిక శాంతి.. ఇవన్నీ కలసి ఈ ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా మార్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? ప్రకృతిని కళ్లారా చూడాలంటే.. సీతాకోకచిలుకల మధ్య అడవిలో విహరించాలంటే.. ఇప్పుడు మూలపాడుకు వెళ్లండి!