New waterfall in AP: ఇటీవల ఆలూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టు మండలంలో భారీ వర్షాల తరువాత ఓ అద్భుతం వెలుగులోకి వచ్చింది. రంగినిగుడ గ్రామ సమీపంలోని అడవిలో ఆకస్మాత్తుగా ఒక అందమైన జలపాతం ప్రవహించడం ప్రారంభించింది. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని ఈ ప్రకృతి కనువిందు వర్షాల కారణంగా జన్మించింది. కొండల మధ్య నుంచి దూసుకొచ్చే చల్లని నీరు, చుట్టూ ఆకుపచ్చ ప్రకృతి.. చూస్తే మనసు సాంత్వన పొందుతుంది.
అయితే ఈ ప్రకృతి వనరును చూసేందుకు ఇంకా చేరుకోలేని స్థితి. అక్కడికి వెళ్లే రహదారులు లేవు. జలపాతాన్ని చూసేందుకు స్థానికులు సైతం నడిచే మార్గాలే ఆశ్రయించాల్సి వస్తోంది. అతి సమీపంలోని ఆదివాసీ గ్రామాల ప్రజలు కూడా వర్షాల వలన ముంచెత్తుతున్న వాగుల మధ్య చిక్కుకుపోయారు. రహదారులు లేకపోవడంతో ఈ ప్రాంతానికి వెళ్లేవారు, అక్కడ నివసించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలపాతానికి దగ్గరలోనే వృద్ధులు, గర్భిణీలు ఉండే పల్లెలు కూడా ఉన్నాయని సమాచారం.
ప్రకృతి అందం.. కానీ ప్రజలకు వేదన
ఒకవైపు కొత్తగా జలపాతం కనిపించడం సంతోషకరమైన విషయం అయితే, మరోవైపు అక్కడికి వెళ్లేందుకు మార్గాలులేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అక్కడ వర్షాల వలన వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ఆదివాసీ కుటుంబాలు తమ గ్రామాల్లోనే చిక్కుకుపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు.
స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా వాగుల మీద బల్లెట్లూ లేవు, వర్షం పడితే మూడు రోజులు ఇంట్లోనే ఉండిపోవాల్సిందే అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం తాత్కాలిక బ్రిడ్జ్ అయినా వేయాలని, కచ్చితంగా రహదారి ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: NHAI new toll rates: మీ రూట్ లో బ్రిడ్జిలు ఉన్న హైవేలు ఉన్నాయా? ఇకపై టోల్ ఫీజు తగ్గింపే!
పర్యాటక దృష్టితో అభివృద్ధి అవసరం
రంగినిగుడ జలపాతం కేవలం ప్రకృతి ప్రేమికులకే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. అటవీ ప్రాంతం, చుట్టూ ఉన్న పచ్చదనం, జలపాత ప్రవాహం ఇవన్నీ కలసి దాని వైభవాన్ని పెంచుతున్నాయి. దీనిని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించాలి. మార్గాలు లేకపోతే ఈ సంపద వృథాగా పోయే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్
ప్రస్తుతం రంగినిగుడలో కనువిందు చేస్తున్న ఈ జలపాతాన్ని చేరుకునేందుకు స్థానికులు బ్రిడ్జ్ నిర్మాణం, బాటలు ఏర్పాటు, బేసిక్ కనెక్టివిటీ కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారులు వేసి, ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లు చేస్తే మాత్రమే ఈ ప్రకృతి రత్నాన్ని ప్రజలకు పరిచయం చేయడం సాధ్యమవుతుంది. ఈ జలపాతం ముంచింగిపుట్టు మండలం ఆందోళనలకు కేంద్రంగా మారకముందే, అధికార యంత్రాంగం చొరవ చూపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.