సురేఖ యాదవ్.. భారతీయ రైల్వేలో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. 1988లో ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టిన ఆమె. 36 ఏళ్ల పాటు లోకో పైలెట్ గా సేవలందించారు. ఆసియాలోనే తొలి మహిళ రైలు డ్రైవర్ అయిన ఆమె ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమెను రైల్వే సిబ్బంది ఘనంగా సన్మానించి ఘన వీడ్కోలు పలికారు. తాజాగా ఆమె నాసిక్ ఇగత్పురి హిల్ స్టేషన్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్-CSMT రాజధాని ఎక్స్ ప్రెస్‌లో చారిత్రాత్మక ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు వచ్చారు. నీలిరంగు బ్లేజర్ ధరించి, నవ్వుతున్న సురేఖను ఆమె తోటి రైలు డ్రైవర్లు, డిపార్ట్ మెంట్ సిబ్బంది, కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు.
60 ఏళ్ల సురేఖ తన కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. మగాళ్లు ఏమాత్రం తీసిపోని రీతిలో లోకో పైలెట్ గా రాణించింది. గూడ్స్ రైళ్ల నుంచి ముంబైలోని ఐకానిక్ లోకల్ రైళ్ల వరకు, ప్రతిష్టాత్మకమైన దక్కన్ క్వీన్ నుంచి ఆధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ వరకు అన్ని రైళ్లను నడిపిన మొదటి మహళా లోకోపైలెట్ గా గుర్తింపు తెచ్చుకుంది. సురేఖ ఎన్నో రికార్డులను సంపాదించింది. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. “ఆసియాలోనే తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖా యాదవ్ 36 సంవత్సరాల అద్భుతమైన సేవ తర్వాత సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. నిజమైన మార్గదర్శకురాలు ఆమె. ఎన్నో అడ్డంకులను అధిగమించింది, కోట్లాది మంది మహిళలకు స్ఫూర్తినిచ్చింది. మహిళలు అందుకోలేని కల అంటూ ఏది లేదని నిరూపించింది. ఆమె ప్రయాణం భారతీయ రైల్వేలలో మహిళా సాధికారతకు చిహ్నంగా ఉంటుంది” అని సెంట్రల్ రైల్వే పశంసించింది.
Smt. Surekha Yadav, Asia’s First Woman Train Driver, will retire on 30th September after 36 glorious years of service
A true trailblazer, she broke barriers, inspired countless women, and proved that no dream is beyond reach.
Her journey will forever remain a symbol of women… pic.twitter.com/5zDOzvkAD4
— Central Railway (@Central_Railway) September 18, 2025
1988లో సతారాలో సురేఖ అసిస్టెంట్ డ్రైవర్ గా బాధ్యతలు చేపట్టారు.. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. పురుషులతో సమానంగా లోకో పైలెట్ గా రాణించారు. సతారాలోని సెయింట్ పాల్ కాన్వెంట్ హైస్కూల్లో ప్రాథమిక విద్య తర్వాత, కరాడ్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదివారు. 1988లో ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టారు. శిక్షణ తర్వాత, 1989లో ఆమె అసిస్టెంట్ లోకో పైలెట్ గా చేరారు. 1996లో నుంచి కోలో పైలెట్ గా మారారు. 2000లో మోటార్ వుమన్ గా, 2010లో ఘాట్ డ్రైవర్ గా మారింది. 2011లో దక్కన్ క్వీన్ ను నడిపింది. 2023లో ఆమె సోలాపూర్ నుంచి ముంబైకి సెమీ హై స్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను నడిపారు.
ఇక తన కెరీర్ లో తల్లిదండ్రులు ఈ వృత్తికి సంబంధించి ఎప్పుడూ నిరుత్సాహా పరచలేదని చెప్పారు సురేఖ. తన భర్త పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేస్తుండగా, ఇద్దరు కుమారులు ఇంజనీర్లుగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఆమె ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లి, ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలో పాల్గొన్నారు.