Operations Sindoor Effect On Flight Services: భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన నేపథ్యంలో ఇరు దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభత్వం గగనతలంలో ఆంక్షలు విధించింది. దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులను మే 10 వరకు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా శ్రీనగర్, జమ్ము, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్ పూర్, గ్వాలియర్ విమానాశ్రయాలకు సర్వీసులు నిలిపివేసింది.
పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి విమానాయాన సంస్థలు. అన్ని ఎయిర్ లైన్స్ లకు సంబంధించిన 300 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ మేరకు 165 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసినట్లు ఇండిగో వెల్లడించింది. మే 10 వరకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. అటు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు కూడా తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. 2 విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించిన ఎయిర్ ఇండియా, అమృత్ సర్ కు వెళ్లాల్సిన 2 అంతర్జాతీయ విమానాలను ఢిల్లీ ఎయిర్ పోర్టుకు మళ్లించినట్లు వెల్లడించింది. ధర్మశాల, లేహ్, జమ్ము, శ్రీనగర్, అమృత్‌సర్ నగరాలకు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది.
ఎయిర్ పోర్టులు మూసివేత, విమానాలు రద్దు
‘ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉత్తర, పశ్చిమ భారతంలో పలు విమానాశ్రయాలను మూసివేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 25 విమానాశ్రయాలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏకంగా 300 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. వీటిలో ఇండిగో విమానాలు అత్యధికంగా 165 ఉన్నాయి. “భారత గగనతలంలో ఆంక్షల ఆకారణంగా పలు విమానాశ్రయాల నుంచి 165 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశాం. మే 10, 2025 ఉదయం 05: 29 గంటల వరకు ఈ విమానాల క్యాన్సిల్ కొనసాగుతుంది” అని ఇండిగో సంస్థ వెల్లడించింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, అమృత్ సర్ సహా పలు నగరాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ రెండు సంస్థలు తమ ప్రయాణీకులు రీషెడ్యూలింగ్ మీద ఛార్జీల మినహాయింపు లేదంటే పూర్తి రీఫండ్ అందించనున్నట్లు తెలిపాయి. “అమృత్ సర్, గ్వాలియర్, జమ్మూ, శ్రీనగర్, హిండన్ కు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి రీఫండ్ చేస్తున్నాం. అవసరం అయిన వాళ్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ను అందిస్తున్నాయి. మే 10, 2025 ఉదయం వరకు ఈ సేవలను అందిస్తాం” అని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అటు స్పైస్ జెట్, అకాశ ఎయిర్, స్టార్ ఎయిర్ సంస్థలు కూడా తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి.
ఢిల్లీ విమానాశ్రయంలో 140 సర్వీసులు రద్దు
అటు దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏకంగా 140 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. వీటిలో రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ వేస్ తమ సర్వీసులను రద్దు చేశాయి.
Read Also: భారత రైళ్లపై పాక్ నిఘా, ఉద్యోగస్తులకు కేంద్రం హెచ్చరికలు!