Made In India Bullet Train: తొలి మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు డిసెంబర్ 2026 నాటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు BEML లిమిటెడ్ వెల్లడించింది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు BEML లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ తెలిపారు. “స్వదేశీ బుల్లెట్ రైలుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2026 నాటికి తొలి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాం. బుల్లెట్ రైలుకు సంబంధించిన రెండు నమూనాలను నిర్మించాల్సి ఉంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీ సాయంతో అత్యంత సమర్థత కలిగిన రైలును రెడీ చేయబోతున్నాం” అని తెలిపారు.
బుల్లెట్ రైళ్లకు ఆర్డర్ల వెల్లువ
BEML నిర్మిస్తున్న బుల్లెట్ రైళ్లకు సంబంధించి ఆర్డర్లు పెద్ద మొత్తంలో వస్తున్నట్లు శంతను రాయ్ తెలిపారు. ఇప్పటికే రూ. 16,000 కోట్లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీ గణనీయంగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హై-మొబిలిటీ వాహనాలు, యుద్దభూమి నిఘా వ్యవస్థల కోసం BEML ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.136 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో కంపెనీలోని అన్ని విభాగాలు సంపూర్ణ ఆదాయంలో వృద్ధి చెందుతాయని రాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రణాళికలు
BEML కంపెనీకి బయటి నుంచి ఎటువంటి నిధులను సేకరించే ఆలోచన లేదన్నారు రాయ్. అయితే మూలధన వ్యయానికి అప్పుల ద్వారా నిధులు సమకూర్చవచ్చని అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం మాకు ఎలాంటి అప్పు లేదు. కానీ, మేము మా క్యాపెక్స్ కు రుణం ద్వారా నిధులు సమకూర్చాలని చూస్తున్నాము ”అని ఆయన అన్నారు. “ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వర్కింగ్ క్యాపిటల్‌ను 30% తగ్గించాలని, వచ్చే సంవత్సరంలో మరో 20% తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కంపెనీ టర్నోవర్ వర్కింగ్ క్యాపిటల్‌కి దాదాపు ఐదు రెట్లు ఉండాలి” అని భావిస్తున్నాం” అన్నారు. మంచి ఆర్డర్లు, హై-ఎండ్ మైనింగ్ పరికరాలు, విక్రయాలు, ఎగుమతులు, జీవనోపాధి నేపథ్యంలో మార్జిన్లను 16%కి మెరుగుపరచాలని భావిస్తున్నట్లు తెలిపారు. “మార్చి 2024లో కంపెనీ 11.97% (మార్జిన్) దగ్గర ఉంది. ఈ సంవత్సరం దాదాపు 12.97% లేదా 13%కి మారాలి అనుకుంటున్నాం. రాబోయే మూడేళ్లలోదాదాపు 15% నుంచి 16%కి చేరుకోవాలి అనుకుంటున్నాం” అని చెప్పుకొచ్చారు.
అత్యంత వేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు
దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, మరోవైపు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అహ్మదాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రూట్ లో సుమారు 508 కిలో మీటర్ల మేర తొలి హైస్పీడ్ కారిడార్ నిర్మాణం అవుతోంది. ఈ మార్గంలో గంటకు 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైళ్లు ప్రయాణించనున్నాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో అహ్మదాబాద్- ముంబై నగరాలను కలపనున్నాయి బుల్లెట్ రైళ్లు. సూరత్, వడోదరతో పాటు 12 స్టాపులలో బుల్లెట్ ట్రైన్ హాల్టింగ్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: ఇదెక్కడి రైలు రా మామా, ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు పట్టిందా?