యాత్రికులకు స్వర్గధామంగా పిలిచే కేరళలో ఎటు చూసినా ప్రకృతి అందాలు అలరిస్తాయి. పరుచుకున్న తేయాకు తోటలు, అందమైన బీచ్‌లు, చారిత్రక నిర్మాణాలు, మెరిసే సముద్ర జలాలు, బ్యాక్ వాటర్స్, దట్టమైన పచ్చని అడవులు, పర్వత శ్రేణులు ఆహా అనిపిస్తాయి. దేశంలో సహజ సౌందర్యాన్ని పెట్టింది పేరు కేరళ. కేరళ అందాలను తిలకించేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ, రైలు ప్రయాణాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలు, పర్వతాలు, నదుల మీదుగా కొనసాగుతూ ఆకట్టుకుంటాయి.
కేరళలో ఆకట్టకునే రైలు ప్రయాణాలు
⦿ కన్యాకుమారి ఎక్స్ ప్రెస్: కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ త్రివేండ్రం నుంచి మొదలై దక్షిణ భాతర కొన అయిన కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. ఈ సుందరమైన రైలు ప్రయాణం కేరళ తీరప్రాంతం వెంబడి తీసుకెళ్తుంది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పశ్చిమ కనుమల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. తీర గ్రామాలు, కొబ్బరి తోటలు, వరి పొలాల గుండా వెళుతున్నప్పుడు, మెరిసే సముద్రంపై మంత్రముగ్దులను చేస్తుంది. సూర్యాస్తమయం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.
⦿ అలెప్పీ-చంగనస్సేరి ప్యాసింజర్: ఆహ్లాదకరమైన రైలు ప్రయాణం కోసం అలెప్పీ- చంగనస్సేరి ప్యాసింజర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ రైలు కేరళలోని ప్రసిద్ధ బ్యాక్ వాటర్స్ గుండా వెళ్తుంది. కాలువలు, హౌస్ బోట్లు, తీర ప్రాంత గ్రామాలు ఆకట్టుకుంటాయి. ఈ రైలు ప్రయాణం అలెప్పీ బ్యాక్ వాటర్స్ నుంచి చంగనస్సేరికి తీసుకెళ్తుంది. మార్గ మధ్యంలో పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు ఆకట్టుకుంటాయి.
⦿ ఎర్నాకులం-కొట్టాయం ప్యాసింజర్: ఎర్నాకులం- కొట్టాయం ప్యాసింజర్ రైలు కేరళలోని ప్రకృతి అందాల నడుమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ మార్గంలో అందమైన గ్రామాలు, వెంబనాడ్ సరస్సు ఆకట్టుకుంటాయి. ఈ రైలు కేరళ వాసుల జీవితాన్ని వీక్షించడానికి ఉపయోగపడుతుంది. బ్యాక్ వాటర్స్ అందాలను చూస్తూ జర్నీ ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ నాగర్ కోయిల్-కన్యాకుమారి ప్యాసింజర్: కేరళలోని అద్భుతమైన తీర ప్రాంతాల సౌందర్యాన్ని చూడాలనుకుంటే.. తప్పకుండా ఈ ట్రైన్ జర్నీ చేయాలి. నాగర్ కోయిల్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం.. తీరం వెంబడి అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే కన్యాకుమారి వరకు తీసుకెళ్తుంది. రైలు తీరప్రాంతం వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు.. విశాలమైన సముద్రం, ఇసుక బీచ్‌లు, పర్వత దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
⦿ షోర్నూర్-నిలంబూర్ రోడ్ ప్యాసింజర్: షోర్నూర్-నిలంబూర్ రోడ్ ప్యాసింజర్ రైలు ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దట్టమైన అడవుల గుండా రైలు ప్రయాణం కొనసాగుతుంది. కేరళ వన్యప్రాణులు, ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ఈ మార్గంలో కొండ ప్రాంతాలు, తేయాకు తోటలు, చిన్న జలపాతాల దర్శనం ఇస్తాయి. ప్రకృతి ఒడిలో తేలిపోతున్న అనుభూతిని అందిస్తుంది.
వాస్తవానికి కేరళలోని ప్రతి రైలు ప్రయాణం విభిన్న ప్రకృతి దృశ్యాలకు నెలవై ఉంటుంది. కేరళ టూర్ ప్లాన్ చేసినప్పుడు కచ్చితంగా రైలు ప్రయాణాలు ఉండేలా చూసుకోండి. రైలులో ఎక్కి మరుపురాని అనుభూతిని పొందే ప్రయత్నం చేయండి.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కావద్దు!