Scam On Waitlisted Tickets: మీరు రైల్వే రిజర్వేషన్ చేయించుకున్నారా.. వెయిటింగ్ లిస్ట్ లో మీ పేరు ఉందా.. ఓ వ్యక్తి మీ వద్దకు వచ్చి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి మీకు టికెట్ ఇచ్చారా.. అయితే ఒక్క నిమిషం ఆలోచించండి. లేకుంటే చిక్కులు తప్పవంటున్నారు రైల్వే అధికారులు. ఔను మీరు ఇలాంటి వారి పట్ల జాగ్రత్త వహించాల్సిందే. లేకుంటే టికెట్ తనిఖీ సమయంలో ఇట్టే పట్టుబడతారు. జరిమానా చెల్లించడమో, జైలుకు కానీ వెళ్ళాల్సిందే.
సాధారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అందుకే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రైల్వే రిజర్వేషన్ చేసుకొని, సీటు కన్ఫర్మ్ చేసుకుంటారు. కొంతమంది రైల్వే యాప్ సాయంతో, మరికొంత మంది రైల్వే రిజర్వేషన్ సెంటర్స్ ని సంప్రదిస్తారు. ఇలాంటి సమయంలోనే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు రైల్వే అధికారులు.
చాలా వరకు రైల్వే రిజర్వేషన్స్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ లో మన పేరు నమోదై ఉంటుంది. అటువంటి సమయంలో ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ అవుతుందని మనం ఎదురు చూపుల్లో ఉంటాం. కొన్ని సమయాల్లో మనం ప్రయానమై రైలు వద్దకు వెళ్లి, టికెట్ ఖరారైందా కాలేదా అంటూ నిర్ధారించుకుంటాం. ఇటువంటి సమయం పలువురికి వరంగా మారింది. ప్రయాణికులను ఇట్టే మోసం చేస్తున్నారట.
ఆ మోసం తీరు ఇలా..
రైళ్ల వద్ద ప్రయాణీకుల రద్దీ ఉన్న సమయంలోనే ఈ మోసాలు జరిగే అవకాశముంది. రైలు సీటు కోసం వెయిట్‌లిస్ట్ ఉన్నప్పటికీ, కొందరు మీ టికెట్ మేము కన్ఫర్మ్ చేయిస్తామంటూ హామీ ఇస్తారు. అలాగే డబ్బులు తీసుకొని, టికెట్ కూడా అందిస్తారు. ఆ తర్వాత టీసీ వచ్చి టికెట్ చెక్ చేస్తేగానీ అసలు విషయం తెలియదు. ఆ టికెట్ డూప్లికేట్ అని అప్పుడు తెలుసుకొని మనం ఖంగుతినాల్సిందే. అంతేకాదు ఎవరి పేరు మీదో తీసిన టికెట్ ని కూడా వీరు, సన్నటి అక్షరాలతో మన పేరు రాసి కూడా అందిస్తారట. చివరకు టికెట్ ఇచ్చిన వ్యక్తి డబ్బులు తీసుకు వెళ్తాడు. తీసుకున్న మనం మాత్రం పోయాం మోసం అంటూ పాట పాడాల్సిందే. జరిమానా తప్పక కట్టాల్సిందే అంటున్నారు రైల్వే అధికారులు.
అరికట్టడం ఇలా..
ఇటీవల ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి టిక్కెట్ ప్రింటింగ్ మిషన్, స్టాంపులు వంటి ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మీ వద్దకు వచ్చి టికెట్ కన్ఫర్మ్ చేస్తామని, టికెట్ అందించిన సమయంలో తప్పక చెక్ చేసుకోవాలి. మీరు రైల్వే టిక్కెట్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ, దానిని రైల్వే కౌంటర్ నుండి మాత్రమే పొందారా లేదా అనేది కూడా నిర్ధారించుకోవాలి.
Also Read: Rohit Sharma: నీకు బుర్ర ఉందా..? రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
పూర్తి పేరును ఉపయోగించి టిక్కెట్‌ను కొనుగోలు చేసిన యెడల ఇటువంటి వాటిని నివారించవచ్చు. మీ గుర్తింపు కార్డులోని వివరాలు సరిపోలే విధంగా, మీ పేరు మీద టికెట్ పొందాలి. రైలులో వెయిటింగ్ లిస్ట్ ఉండి, బ్రోకర్ మీకు కన్ఫర్మ్ చేసిన టిక్కెట్‌ను అందిస్తానని క్లెయిమ్ చేస్తే, ఏదో అనుమానాస్పదంగా ఉందని మీరు గ్రహించాలి. అలాంటి టిక్కెట్‌ను కొనుగోలు చేయడం వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.