Wildlife Travel on a Budget: దేశంలో ప్రకృతి, అడవులు, వన్యప్రాణులకు కొదవ లేదు. అయితే, కొన్ని అరుదైన జంతువులు, పక్షులు మాత్రం దేశంలోని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. వాటిని దగ్గరగా చూడాలంటే చాలా ఖర్చు అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్లానింగ్ తో తక్కువ బడ్జెట్ లోనే ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. వైల్డ్ లైఫ్ వీక్ 2026 సందర్భంగా ఐఆర్‌సీటీసీ మూడు ప్రత్యేకమైన వైల్డ్ లైఫ్ డెస్టినేషన్స్ ను హైలైట్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని బుగున్ లియోసిచ్లా, మణిపూర్‌లోని సంగై జింక, బెంగాల్‌లోని రెడ్ పాండాలను చూసేందుకు అవకాశం ఉంటుంది.
బుగున్ లియోసిచ్లా చాలా అరుదైన, ఆకర్షణీయమైన పక్షి జాతుల్లో ఒకటి. ఇది ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈగల్ నెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిసరాల్లో కనిపిస్తుంది. పశ్చిమ కామెంగ్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పక్షుల వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఢిల్లీ నుంచి మూడు రోజులు, రెండు రాత్రుల ట్రిప్‌ను ప్లాన్ చేస్తే ఒక్కొక్కరికి సుమారు రూ.18,000 నుంచి రూ.25,000 వరకు ఖర్చు కావచ్చు. ఇందులో విమాన ప్రయాణం, బడ్జెట్ వసతి, భోజనం, స్థానిక రవాణా లాంటి ఖర్చులు ఉంటాయి. అయితే, ప్రయాణ తేదీ, విమాన టికెట్ ధర, వసతి ఆధారంగా ఖర్చు మారవచ్చు.
సంగై జింకలను చూడాలనుకునేవారు మణిపూర్‌లోని కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ ను సందర్శించవచ్చు. దీనిని ‘నాట్య జింక’ అని కూడా పిలుస్తారు. ఈ జాతీయ పార్క్ లోక్‌తక్ సరస్సుపై ఉన్న ప్రత్యేకమైన తేలియాడే పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కనిపించే ‘ఫుమ్డిస్’ అనే తేలియాడే వృక్ష దిబ్బలు సంగై జింకలకు సహజ ఆవాసంగా ఉంటాయి. ఢిల్లీ నుంచి మూడు రోజుల ట్రిప్‌కు ఒక్కొక్కరికి సుమారు రూ.18,000 నుంచి రూ.25,000 వరకు బడ్జెట్ లో వెళ్లొచ్చు.
హిమాలయ ప్రాంత వన్యప్రాణులను చూడాలనుకునేవారికి బెంగాల్‌లోని సింగలిలా నేషనల్ పార్క్ మరో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం రెడ్ పాండాలకు ప్రసిద్ధి చెందడమే కాకుండా అడవులు, పర్వత దృశ్యాలు, ట్రెక్కింగ్ మార్గాలతో ఆకట్టుకుంటుంది. ఢిల్లీ నుంచి మూడు రోజులు, రెండు రాత్రుల ప్రయాణానికి ఒక్కొక్కరికి సుమారు రూ.17,000 నుంచి రూ.24,000 వరకు ఖర్చు కావచ్చు. విమాన టికెట్, వసతి, స్థానిక ప్రయాణ ఖర్చుల ఆధారంగా మొత్తం బడ్జెట్ మారుతుంది.
బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు విమాన టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం, వసతిని ముందే ఎంచుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. స్థానికంగా టాక్సీలను ఇతర ప్రయాణికులతో షేర్ చేసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఎయిర్ ద్వారా రూ.100 ప్లస్ జీఎస్‌టీ కన్వీనియన్స్ ఫీజుతో పాటు రూ.50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా వంటి ప్రయోజనాలను కూడా హైలైట్ చేస్తున్నారు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, రక్షణ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రత్యేక ఛార్జీలను కూడా బుకింగ్ సమయంలో పరిశీలించవచ్చు.
Read Also: ఇక ఫెర్రీ బోటులో భోగపురం ఎయిర్ పోర్టుకు.. విశాఖలో క్రేజీ కనెక్టివిటీ ప్లాన్!