Governor Quota: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో త్వరలోనే ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు,క్షేత్రస్థాయి నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణం ఆశావహుల రాకపోకలతో సందడిగా మారింది. ఎమ్మెల్సీలుగా తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహ నేతలు పీసీసీ అధ్యక్షుడిని కలసి తమ వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో పార్టీ విజయం కోసం చేసిన సేవలు, పార్టీ పట్ల వారికున్న నిబద్ధతను వివరిస్తూ తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. డైలీ గాంధీభవన్‌కు వచ్చే నాయకులు, తమ మద్దతుదారులతో కలసి పీసీసీ చీఫ్‌తో వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ కార్యాలయంలో హాడవిడి నెలకొన్నది.
గవర్నర్ కోటా కింద తమ పేరును పరిశీలించాలని పలువురు నేతలు పార్టీకి రిక్వెస్ట్ లు పెట్టారు. ఇప్పటి వరకు గౌరి సతీష్ ,సత్తు మల్లేష్, అనిల్, చనగాని దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, డాక్టర్ లింగం యాదవ్, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.ఇక వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా సామాజిక సమీకరణాలు, పార్టీలో తమ సీనియారిటీని ప్రాతిపదికగా చూపిస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీని పవర్ లోకి తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తయినా..తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం రాలేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి రాజకీయ భవిష్యత్ ను పటిష్టత చేయాలని పలువురు నేతలు కోరుతున్నారు.
Also read: సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!
గ్రాడ్యుయేట్ స్థానాలు రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో త్వరలో ఖాళీ కానున్న మూడు స్థానాల్లో రెండు బీసీలు, ఒకటి ఎస్టీకి ఇవ్వాలంటూ గాంధీభవన్ కు రిక్వెస్టులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల నేతలు పార్టీకి చేసిన సేవ, తమ ప్రాధాన్యతలను వివరిస్తూ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. పీసీసీ చీఫ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా ప్రపోజల్స్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ముందున్న గ్రాడ్యుయేట్ స్థానాలు గెలిపించేందుకు ప్రయత్నాలు చేయాలని ఆ ఇద్దరి నేతల నుంచి ఆశావహులకు ఆదేశాలు వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సారి భారీ కాంపిటేషన్ నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాa కేటాయింపులో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ లో మొదట్నుంచి కష్టపడిన నేతలకు ఇస్తారా? సామాజిక సమతుల్యత పాటిస్తారా? అనేది త్వరలోనే అధిష్టానం నిర్ణయం ద్వారా తేలనున్నది.
Also read: సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్!