Bullet Train Gantry Collapses: అహ్మదాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ గ్యాంట్రీ కూలిపోయింది. బుల్లెట్ ట్రైన్ లైన్ లో స్తంభాల మధ్య కాంక్రీట్ గిడ్డర్ లను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించే భారీ గ్యాంట్రీ జారి పడింది. ఈ ప్రమాదం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అహ్మదాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే 50కి పైగా రైళ్లపై ఎఫెక్ట్ పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
శరవేగంగా గ్యాంట్రీ పునరుద్ధరణ పనులు
ఈ ప్రమాదంపై అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (AFES) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటన రాత్రి 10.28 గంటల సమయంలో జరిగినట్లు తెలిపారు. డి మార్ట్ సమీపంలోని వాట్వా రోడ్ లోని హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో రెండు స్తంభాల మధ్య స్లాబ్ లాంచింగ్ క్రేన్ కూలిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) సైతం ఈ ఘటనపై స్పందించింది. “మార్చి 23న రాత్రి 11 గంటలకు వాట్వాలో వయాడక్ట్ నిర్మాణం కోసం ఉపయోగించే సెగ్మెంటల్ లాంచింగ్ గ్యాంట్రీలో ఒకటి కాంక్రీట్ గిర్డర్ ను ప్రారంభించిన తర్వాత ఒకటి వెనక్కి జారింది. నెమ్మదిగా కింద పడిపోయింది. ఈ ప్రభావం ఆ రైల్వే లైన్ లో నడిచే పలు రైళ్ల మీద పడింది. NHSRCL సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గ్యాంట్రీని పునరుద్ధరించేందుకు రెండు హెవీ డ్యూటీ రోడ్ క్రేన్ లతో సహా భారీ యంత్రాలు స్పాట్ కు చేరుకున్నాయి” అని వివరించింది.
కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
రైల్వే గ్యాంట్రీ కూలడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ప్రభావితం అయ్యాయి. సుమారు 50కి పైగా రైళ్లపై ఈ ఎఫెక్ట్ పడిందని పశ్చిమ రైల్వేలోని అహ్మదాబాద్ డివిజన్ వెల్లడించింది. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ ను చెక్ చేసుకోవాలని సూచించింది. కర్ణావతి ఎక్స్ ప్రెస్, గుజరాత్ క్వీన్, గుజరాత్ ఎక్స్ ప్రెస్ తో పాటు కొన్ని ఇంటర్ సిటీలు కలిపి ఇరవై ఐదు రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపింది. శతాబ్ది ఎక్స్ ప్రెస్, ముంబై-గాంధీనగర్ వందే భారత్, సబర్మతి ఎక్స్‌ప్రెస్, శాంతి ఎక్స్ ప్రెస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడినట్లు వెల్లడించింది. హౌరా ఎక్స్ ప్రెస్ తో సహా ఐదు రైళ్లకు సంబంధించి షెడ్యూల్ ను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఓఖా- గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ తో సహా మరో ఆరు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గ్యాంట్రీ పనులు పూర్తి చేసి, మళ్లీ యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: RAC టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే.. ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే