షాపింగ్ మాల్స్ లో పండగల సందర్భంలా లక్కీ డ్రా తీస్తుంటారు. ఆ డ్రా లో సెలక్ట్ అయిన వారికి బహుమతులు కూడా ఇస్తుంటారు. అలాంటి లక్కీ డ్రాని ఇప్పుడు ముంబై సెంట్రల్ రైల్వే కూడా ప్రవేశ పెట్టింది. టికెట్ కొని ప్రయాణించేవారి కోసం బహుమతులిస్తామని ప్రకటించింది. అలాంటిలాంటి బహుమతులు కాదు, అదిరిపోయే క్యాష్ ప్రైజ్ లు. ప్రతి రోజూ ఒకరికి 10వేల రూపాయలు క్యాష్ ప్రైజ్. వారానికి ఒకరికి 50వేల రూపాయల క్యాష్ ప్రైజ్. ఈ బహుమతుల ద్వారా ముంబై సబర్బన్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, అదే సమయంలో టికెట్ లెస్ ట్రావెలర్ల సంఖ్య కూడా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టికెట్ కొననివాళ్లు ఎంతమంది..?
సెంట్రల్ రైల్వే ద్వారా రోజుకి 40 లక్షల మంది ప్రయాణీకులు రైళ్లలో వెళ్తుంటారు. వీరిలో టికెట్ లేని వారు దాదాపు 20 శాతం మంది ఉంటారని అంచనా. వీరికోసం రోజువారీ తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు. తనిఖీల్లో రోజుకి 4వేల నుంచి 5వేల మంది పట్టుబడుతుంటారు. వీరు జస్ట్ దొరికేవారు మాత్రమే, దొరక్కుండా దొరల్లా తప్పించుకు తిరిగేవారు ఇంకా చాలామందే ఉన్నారు. వారిలో మార్పు తెచ్చేందుకే టికెట్ కొను, బహుమతి పట్టు స్కీమ్.
బహుమతి ఎలా ఇస్తారు..?
సెంట్రల్ రైల్వే టీటీఈలు ప్రతి రోజూ టికెట్ లు చెక్ చేస్తుంటారు. ఇలా టికెట్లు చెక్ చేస్తున్నప్పుడు వారికి ఎదురుపడిన వారిలో ఒకరిని సడన్ గా విజేతగా ప్రకటిస్తారు. వారికి అక్కడికక్కడే 10వేల రూపాయలు బహుమతి ఇస్తారు. వారంలో ఒకరికి లక్కీ డ్రా ద్వారా 50వేల రూపాయలు ఇస్తారు. ఈసారి మీకు టికెట్ కలెక్టర్ కనపడితే అతడిని తప్పించుకుని వెళ్లకండి, నేరుగా అతని వద్దకు వెళ్లి మీ టికెట్ చూపించండి, అదృష్టం ఉంటే ఆ రోజు లక్కీ ట్రావెలర్ మీరే అవుతారు, ఎంచక్కా ఇంటికి 10వేల రూపాయలు పట్టుకెళ్తారు. ప్రతి రోజూ టికెట్లు కొనుగోలు చేసే సాధారణ ప్రయాణికులతోపాటు, నెలవారీ పాస్ లు తీసుకునే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
ఇక రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు, ఇబ్బంది లేకుండా టికెట్ల బుకింగ్ కోసం సెంట్రల్ లైర్వే అనేక చొరవలు తీసుకుంది. ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లను అమర్చింది. మొబైల్ టికెటింగ్ యాప్ ద్వారా మన ఫోన్ లోనే టికెట్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయినా కూడా చాలామంది టికెట్ లేకుండానే ప్రయాణించడం విశేషం.
ఇక ముంబై డివిజన్ కు సంబంధించి జరిమానాలు కూడా భారీగానే వసూలవుతున్నాయి. ముంబై రైల్వేకు చెందిన ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (TTI) సుధా ద్వివేది.. ఇందులో రికార్డ్ సృష్టించారు. ఒక్క రోజులోనే ఆమె 202మంది టికెట్ లెస్ ట్రావెలర్స్ ని గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆమె ఈ ఫీట్ సాధించారు. ఆమె తనిఖీల ద్వారా మొత్తం రూ. 55,210 జరిమానా వసూలు చేశారు. ఒక టీటీఈ ఒక రోజులో వసూలు చేసిన జరిమానాల్లో ఇదే అత్యథికం.