Summer Trip: సమర్ అంటే సెలవులు ఉంటాయి కాబట్టి చాలా మంది అలా వెకేషన్లకు వెళ్లాలని అనుకుంటారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వారికి కూడా చిన్న బ్రేక్ దొరికేది వేసవి కాలంలోనే. అందుకే చిన్న ట్రిప్ అయినా సరే అలా వెళ్లి రావాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎండలు మండిపోయే ఇలాంటి సమయంలో ఎక్కడికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. వేసవి కావడంతో ఇండియాలో చాలా చోట్ల విపరీతమైన వేడి ఉంటుంది. అందుకే టూర్ ప్లాన్ చేయాలి అనుకునే వారు ఎక్కడివి వెళ్తే ఎండలు తక్కువగా ఉంటాయో ముందుగానే ఓ లిస్ట్ రెడీ చేసుకోవడం బెటర్. సమ్మర్‌లో ఎక్కడికి వెళ్తే అధిక ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీ
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో విపరీతమైన వేడి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత తరచుగా 45°Cకి చేరుకుంటుంది. వీటికి తోడు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా రద్దీ, ట్రాఫిక్ ఉంటుంది. ఢిల్లీకి సమ్మర్‌లో వెళ్లాలి అనుకోవడం మాత్రం సరికాదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కడి వాతావరణానికి అలవాటు పడని వారు వెళ్తే మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్
వేసవిలో ఉత్తర ప్రదేశ్ దగ్గర ఉన్న వారణాసి, ఆగ్రాకు వెళ్లడం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధ్యాత్మిక ప్రదేశం కావడంతో వారణాసిలో యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది రద్దీకి దారితీస్తుంది. ఈ ప్రాంతానికి వెళ్లే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎండ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ సమయంలో అక్కడికి వెళ్లకపోవడమే మంచిది.
పశ్చిమ బెంగాల్
కోల్‌కతాలో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ ఉష్ణోగ్రతలు 38–40°C ఉండటం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతాయి. జూన్‌లో ప్రారంభమయ్యే రుతుపవనాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అంత సేఫ్‌గా ఉండే పరిస్థితి కూడా ఉండదు. కోల్‌కతాకు పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కానీ, వేసవిలో అక్కడికి వెళ్తే అధిక ఉష్ణోగ్రతల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది.
జమ్మూ & కాశ్మీర్
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కాశ్మీర్ లోయను సందర్శించడానికి కూడా పర్యటకులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాడి ఘటనను పక్కన పెడితే జమ్మూ & కాశ్మీర్‌లో దిగువ ప్రాంతాలలో వేసవి వేడి చాలా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాలలో వాతావరణం ఒకే రకంగా ఉండదు. దీని వల్ల పర్యటనకు వెళ్లినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: భయం వద్దు.. ఇండియాలో ఈ టూరిస్ట్ ప్లేస్‌లు చాలా సేఫ్
బీహార్
బీహార్‌లో సాధరణంగానే తీవ్రమైన వేడి ఉంటుంది. వేసవి వచ్చిందంటే అక్కడ తరచుగా ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు సరిగా ఉండవు. అప్పుడప్పుడు శాంతిభద్రతల సమస్యలు ఉండటం వల్ల పర్యాటకులకు తక్కువ భద్రత సౌకర్యంగా ఉంటుంది. పాట్నా వంటి ప్రదేశాలకు వెళ్లాలి అనుకునే వారు సమ్మర్‌లో కాకుండా ఇతర సమయాల్లో వెళ్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
రాజస్థాన్
రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45–48°C వరకు పెరుగుతాయి.అప్పుడప్పుడు అక్కడ ఇసుక తుఫానులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు నీటి కొరత కూడా ఎక్కువగానే ఉంటుంది. జైపూర్, జోధ్‌పూర్ వంటి ప్రదేశాలకు పర్యటనకు వెళ్లాలి అనుకునే వారు వేసవి కాలంలో అక్కడికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది.
గోవా
గోవాలో ఫేమస్ బీచ్‌లు ఉంటాయి. సమ్మర్ కాబట్టి వెకేషన్‌కు వచ్చే వారి వల్ల అవి కూడా రద్దీగా మారుతాయి. ప్రీ-మాన్‌సూన్ వల్ల ఆకస్మిక వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సముద్రాలు అల్లకల్లోలంగా ఉండటం వల్ల కూడా జల క్రీడలు ప్రమాదకరంగా మరిపోతాయి. అందుకే వేసవిలో గోవాకు వెళ్లాలి అనుకునే వారు ముందుగానే అక్కడ వాతావరణ పరిస్థితుల గురించి కనుక్కొని వెళ్లడం ఉత్తమం.