హైదరాబాద్ మల్కాజ్ గిరి పరిధిలో నెల రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ కొనసాగిస్తున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మల్కాజ్ గిరి పరిధిలోని గోపాల్ నగర్- మౌలా అలీ సమీపంలోని స్ప్రింగ్ హాస్పిటల్ మధ్య సిమెంట్ కాంక్రీట్ రోడ్డునుపనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుండి మే 26 వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ప్రకటించారు. రోడ్డు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు తెలిపారు.
రాచకొండ కమిషనర్ ఏమన్నారంటే?
ట్రాఫిక్ సజావుగా సాగేలా, రోడ్డు నిర్మాణ సమయంలో ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ డైవర్షన్స్ విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు వెల్లడించారు. ఈ ప్రాంతంలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీసీ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన సిమెంట్ కాంక్రీట్ రోడ్డు ఏర్పాటుతో స్థానికులకు, ప్రయాణీకులకు దీర్ఘకాలిక ఉపశమనం కలగనుంది.
ట్రాఫిక్ మళ్లింపులు ఎక్కడ విధించారంటే?
మల్కాజ్ గిరి ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించినట్లు పోలీసులు తెలిపారు. పలు ప్రాంతాల ప్రజలు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.
⦿ ECIL నుంచి ZRTI సిగ్నల్, H.B. కాలనీ, యునాని హాస్పిటల్, NTR విగ్రహం దగ్గర లాలాపేట, తార్నాక వైపు వెళ్లే వాహనాలను రమాదేవి సిగ్నల్ వద్ద మళ్లించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి గమ్యస్థానాలకు పంపుతారు.
⦿ అటు తార్నాక, లాలాపేట, ZRTI సిగ్నల్ నుంచి ECIL వైపు వెళ్లే వాహనాలను ZRTI Y జంక్షన్ ద్వారా మళ్లిస్తారు. NTR విగ్రహం, యునాని హాస్పిటల్, HB కాలనీ, రమాదేవి సిగ్నల్ దాటిన తర్వాత వారిని ఇతర మార్గాల ద్వారా పంపిస్తారు.
ప్రజలు సహకరించాలన్న పోలీసుల
సుమారు నెల రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా వాహనదారులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రయాణీకులు, వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందితో సహకరించాలని, అదే సమయంలో మళ్లింపులను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ మళ్లింపు విషయాలను గమనించకుండా ప్రయాణం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ప్రయాణీకులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కొద్ది రోజులు ఇబ్బంది కలిగినా శాశ్వతంగా లాభం కలిగే అవకాశం ఉందన్నారు.
Read Also: భార్యను కలిసేందుకు వచ్చి, పోలీసులకు చిక్కి..
సీసీ రోడ్డు నిర్మాణంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు
మల్కాజ్ గిరి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మిస్తున్న సీసీ రోడ్లతో మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు పోలీసులు. వర్షాకాలంలోనూ ప్రయాణీకులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు. సమస్కల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పనులకు ప్రజలకు సహకరించాలని రాచకొండ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు పనులు సజావుగా జరిగేలా స్థానికులు, ప్రయాణీకులు ట్రాఫిక్ అధికారుల ఆదేశాలను పాటించాలన్నారు.
Read Also: Traffic diversions declared in Hyderabad: Check routes and dates