Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. జర్నీ సమయంలో ఆహ్లాదంగా గడిపేందుకు తగిన సౌకర్యాలను కల్పిస్తోంది. ఓ రైలులో ఏకంగా రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. హాయిగా తింటూ జర్నీ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఆ రైలు ఏది? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది?
‘దక్కన్ క్వీన్’ వెరీ స్పెషల్ గురూ..
ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించే రైలు దక్కన్ క్వీన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Deccan Queen Super Fast Express). దేశంలోని అత్యంత ప్రసిద్ధ, పురాతన రైళ్లలో ఒకటి. ఇది ముంబై (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(CSMT)- పూణే మధ్య నడుస్తుంది. సెంట్రల్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైలు 1930 జూన్ 1న ప్రారంభమైంది. దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు కూడా ఇదే. మొదటి లాంగ్ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ హాల్డ్ రైలు, మొదటి వెస్టిబ్యూల్డ్ రైలు, మహిళలకు ప్రత్యేక కోచ్ ను కలిగి తొలి రైలు కూడా ఇదే. అంతేకాదు, మొదటి డైనింగ్ కార్ కలిగిన రైలుగా చరిత్రలో నిలిచింది. మొత్తంగా ఈ రైలు బోలెడె విశేషాలను కలిగి ఉంది.
‘దక్కన్ క్వీన్’ విశేషాలు
‘దక్కన్ క్వీన్’ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు (12123/12124) పూణే-ముంబై మధ్యలో రాకపోకలు కొనసాగిస్తుంది. సుమారు 190 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. సుమారు 3 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ రైలు సగటు వేగం 60 కిలో మీటర్లు కాగా, గరిష్ట వేలం 105 కిలో మీటర్లు. ఈ రైలు (12123) ముంబై నుంచి సాయంత్రం 5.10కి బయల్దేరుతుంది. 8.25కి పూణే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(12124) పూణే నుంచి ఉదయం 7:15కి బయలుదేరి.. ముంబైకి 10:25కి చేరుతుంది. ఈ రైలు పూణే నుంచి ముంబైకి వెళ్లే సమయంలో లోనావాల, కర్జత్, దాదర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ముంబై నుంచి పూణేకు వెళ్లే సమయంలో కర్జత్, లోనావాలా, శివాజీ నగర్ లో ఆగుతుంది. ఈ రైలును 2022లో LHB కోచ్ లతో అప్ గ్రేడ్ చేశారు. గ్రీన్-బ్రౌన్-యెల్లో లివరీతో కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.
‘దక్కన్ క్వీన్’ హిస్టరీ..
‘దక్కన్ క్వీన్’ రైలును 1930లో ప్రారంభించారు. అప్పట్లో ఇందులో 7 కోచ్‌లు మాత్రమే ఉండేవి. ఫస్ట్, సెకండ్ క్లాస్‌లు మాత్రమే ఉండేవి. 1955లో థర్డ్ క్లాస్ ప్రవేశపెట్టారు. ఈ రైలు ప్రారంభం నుంచి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తోనే నడించింది. జూన్ 1 ఈ రైలుకు సంబంధించి 95వ వార్షికోత్సవం నిర్వహించనున్నారు. పూణే రైల్వే అధికారులు ఈ వేడుకను నిర్వహించనున్నారు. ‘దక్కన్ క్వీన్’ రైలు ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. భోర్ ఘాట్‌ను దాటుతూ ముందుకు వెళ్తుంది. ఇక్కడ 28 టన్నెల్స్ ఉంటాయి. అద్భుతమైన లోనావాలా, ఖండాలా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ముంబై-పూణే మధ్య ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Also: చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బోలెడు బస్సులు, ఇక ఆ కష్టాలు తీరినట్లే!