హైదరాబాద్ లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో చాలా రైళ్లను చర్లపల్లి నుంచే నడిపిస్తున్నారు. అయితే, చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు తగిన బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అంబాటులో లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు పెంచాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు సిటీలోని పలు బస్ స్టేషన్ల నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు బస్సులు నడుపుతున్నారు. ఇంతకీ ఏ ప్రాంతాల నుంచి ఏ బస్సులు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
⦿ అప్జల్ గంజ్- చర్లపల్లి- 71A/C: అప్జల్ గంజ్ బస్ స్టేషన్ నుంచి 71A/C నెంబర్ బస్సులను నడిపిస్తోంది ఆర్టీసీ. ఈ బస్సులు అప్జల్ గంజ్ నుంచి ప్రారంభమై.. సీబీసెస్, అంబర్ పేట్, ఉప్పల్, మేడిపల్లి, చంగిచర్ల మీదుగా చర్లపల్లికి చేరుకుంటాయి.
⦿ పటాన్ చెరు- చర్లపల్లి- 219/250C: పటాన్ చెరు నుంచి చర్లపల్లి వరకు బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సులు లింగంపల్లి, కూకట్ పల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటాయి.
⦿ సికింద్రాబాద్-చర్లపల్లి- 16A: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు 16A నెంబర్ బస్సులను నడిపిస్తుంది ఆర్టీసీ. ఈ బస్సులు మల్కాజ్ గిరి, సఫిల్ గూడ, నేరేట్ మెట్, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, చక్రిపురం, చర్లపల్లి సెంట్రల్ జైల్ మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరకుంటుంది.
⦿ బోరబండ-ఉప్పల్-చర్లపలి- 113 FZ: బోరబండ నుంచి ఉప్పల్ మీదుగా చర్లపల్లికి ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. ఈ బస్సులు ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అంబర్ పేట, ఉప్పల్, చెంగిచర్ల మీదుగా చర్లపల్లికి నడుస్తున్నాయి.
⦿ సికింద్రాబాద్- చర్లపల్లి- 17H/C: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి బస్సులు నడుస్తున్నాయి. ఇవి తార్నాక, లాలాపేట్, హెచ్బీ కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, కేబుల్ జంక్షన్ మీదుగా చర్లపల్లికి చేరుకుంటాయి.
Read Also: విజయవాడ To అయోధ్య, పరుగులు తీయనున్న వందేభారత్ స్లీపర్!
⦿ 16H/49M నెంబర్ గల బస్సులు మెహదీపట్నం నుంచి పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఆనంద్ బాగ్, హెచ్బీ కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ మీదుగా చర్లపల్లి స్టేషన్ కు చేరుకుంటాయి. అటు 49M/250c నెంబర్ గల బస్సులు మెహదీపట్నం నుంచి పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మల్లాపూర్ మీదుగా చర్లపల్లి స్టేషన్ కు చేరుకుంటాయి. ఈ బస్సుల ద్వారా చర్లపల్లికి వెళ్లే రైల్వే ప్రయాణీకులు ఈజీగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Read Also: ఏపీలో సీ ప్లేన్ సర్వీసులు, ఎక్కడి నుంచి ఎక్కడి కంటే?