Indian Railways: రాజధాని ఎక్స్ ప్రెస్. తరచుగా రైలు ప్రయాణం చేసే వారికి ఈ రైలు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తొలిసారి ఈ హైస్పీడ్ రైలు మార్చి 1969లో తన సేవలను ప్రారంభించింది. భారతీయ రైల్వే సంస్థ హౌరా-ఢిల్లీ మార్గంలో దానిని ప్రారంభించింది. ఈ రైలు ప్రయాణీకులకు లగ్జరీ సౌకర్యాలను కల్పించడంతో పాటు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించింది. ఐదు దశాబ్దాలు గా రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు దేశ ప్రజలు సేవలు అందిస్తున్నాయి.
అప్పట్లోనే గంటకు 125 కిలో మీటర్ల వేగం
రాజధాని ఎక్స్ ప్రెస్ 1973లోనే హౌరా-ఢిల్లీ మార్గంలో గంటకు గరిష్టంగా 120 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. రెండు రెండు నగరాలను 17 గంటల 20 నిమిషాల్లో కలిపి సంచలనం సృష్టించింది. 2025లో అదే దూరాన్ని చేరుకునేందుకు 17 గంటల 15 నిమిషాలు పడుతుంది. గరిష్ట వేగం గంటకు 130 కి.మీకి పెరిగినప్పటికీ, సగటు వేగం గంటకు 84 కిలో మీటర్లకే పరిమితం అయ్యింది. అటు ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ వేగం కొంచెం మెరుగ్గా ఉంది. 1975లో 19 గంటల 5 నిమిషాల సమయం పట్టగా, ఇప్పుడు 15 గంటల 32 నిమిషాలకు తగ్గింది. అయినప్పటికీ, దాని సగటు వేగం గంటకు కేవలం 89 కిలో మీటర్లు. మరోవైపు 1993లో ప్రవేశపెట్టిన చెన్నై-ఢిల్లీ రాజధాని రైలు వేగంలోనూ అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా తేడా లేదు. నిజానికి, 30 సంవత్సరాల క్రితం 28 గంటల 15 నిమిషాల సమయం పట్టగా, ఇప్పుడు 28 గంటల 35 నిమిషాలకు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
వందే భారత్ విదేశీ రైళ్లతో పోటీ పడేనా?
ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు ఇప్పటి వరకు ఉన్న రైళ్లతో పోల్చితే, వేగంలో, ప్రయాణీకులను అందించే సౌకర్యాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే, విదేశాల్లో అందుబాటులో ఉన్న రైళ్లకు ఇవి ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేవు. ఉదాహరణకు, న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎనిమిది గంటల్లో 759 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సగటు వేగం గంటకు 94.88 కి.మీ. భోపాల్-న్యూఢిల్లీ మార్గం 702 కిమీ ఉంటుంది. ఈ మార్గంలో వందేభారత్ రైలు 93.6 కిమీ వేగంతో పనిచేస్తుంది. విశాఖపట్నం-సికింద్రాబాద్ నడుమ 698 కి.మీ దూరం ఉంటుంది. ఇక్కడ సగటు వేగం గంటకు కేవలం 82 కి.మీ కావడం విశేషం. విదేశాల్లో ఇప్పటికే 250 కిలో మీటర్ల నుంచి 350 కిలో మీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వాటికి వందేభారత్ ఏ కోణంలోనూ పోటీ ఇచ్చే అవకాశం లేదు.
భారత్ లో రైల్వే టెక్నాలజీ డెవలప్ అభివృద్ధి
భారత్ లో లోకోమోటివ్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోటీ పడేందుక చాలా కష్టపడుతోంది. ఆవిరి రైలు తర్వాత 20వ శతాబ్దంలో డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 90 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించాయి. 20వ శతాబ్దం మధ్యలో ALCO WDM-2 లాంటి డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టారు. ఇవి గంటకు 105 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించాయి. 1980లో WAP-1 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అందుబాటులోకి వచ్చింది. ఇది 130 కిలో మీటర్ల వేగంతో అందుబాటులోకి వచ్చింది. 1969 రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రారంభం కావడంతో భారత్ ప్రపంచ స్పీడ్ ప్రమాణాలకు చేరువ అయ్యింది. WDM-4 డీజిల్ 120 kmph వేగంతో ప్రయాణించింది. 90వ దశకంలో WAP-4 లాంటి పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైళ్లను 130-140 కిలో మీటర్ల వేగంతో నడిచాయి. 2000వ దశకం ప్రారంభంలో విద్యుదీకరణ వేగవంతం అయ్యింది. ఆ తర్వాత గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి.
Read Also: గంటన్నరలోనే హైదరాబాద్ నుంచి విశాఖకు.. విమానంలో కాదు, రైల్లో!