Hyderabad International Airport: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి అంతర్జాతీయ కనెక్టివీటిని మరింత పెంచేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి నేరుగా 10 దేశాలకు సర్వీసులను ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టు నుంచి 22 దేశాలకు నేరుగా కనెక్టివిటీ ఉండగా, ఇప్పుడు ఈ లిస్టులో మరో 10 దేశాలకు అదనంగా చేరబోతున్నాయి.
వచ్చే 6 నెలల్లో ఫస్ట్ బ్యాచ్ విమాన సర్వీసులు
రానున్న 6 నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి హాంకాంగ్, హనోయ్, అడ్డిస్ అబాబా, ఆమ్ స్టర్ డామ్ దేశాలకు తొలి విడుత విమానాలు ప్రారంభం కానున్నాయి. అటె పారిస్, ఆస్ట్రేలియా, ఖాట్మండు, క్రాబీ, జకార్తా, డెన్ పసర్ తో సహా సరికొత్త డెస్టినేషన్స్ కు 12 నుంచి 18 నెలల్లో ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సర్వీసుల ప్రారంభానికి సంబంధించి విమానాశ్రయ అధికారులు పలు భారతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. త్వరలోనే ఈ చర్చలు పూర్తి కానున్నాయి.
కొత్త సర్వీసులతో ఎన్నో ఉపయోగాలు
శంషాబాద్ నుంచి నేరుగా ఆయా దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడం వల్ల ఎంతో మంది ప్రయాణీకులకు మేలు కలగనుంది. ముఖ్యంగా ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికులు సింగపూర్ లేదంటే బ్యాంకాక్ లో లే ఓవర్ లతో ఎక్కువ సమయం వృథా అవుతుంది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పారిస్ కు ప్రయాణించే ప్యాసింజర్లు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ముందు పశ్చిమాసియా, ఢిల్లీ, ముంబై లో స్టాప్ ఓవర్లను ఎదుర్కొంటున్నారు. ఇకపై ఆ సమస్య తీరనుంది.
త్వరలో మరిన్ని దేశాలకు నేరుగా సర్వీసులు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ పనికర్ తెలిపారు. “పలు దేశాలకు నేరుగా విమాన సర్వీసలు ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను హైదరాబాద్ తో కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ప్రదీప్ తెలిపారు.
కరోనా తర్వాత భారీగా పెరిగిన అంతర్జాతీయ కనెక్టివిటీ
2024 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ 4.2 మిలియన్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ సీట్ల సామర్థ్యం 60,889కి పెరిగింది. కరోనాకు ముందు ఈ సంఖ్య, వారానికి 46,832 సీట్లు మాత్రమే ఉండేవి. కరోనా తర్వాత అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత పెరిగింది. గత రెండు సంవత్సరాలలో, ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ), ఫుకెట్ (థాయిలాండ్), మదీనా (సౌదీ అరేబియా), డాన్ ముయాంగ్ (థాయిలాండ్), ఢాకా (బంగ్లాదేశ్), మాలే (మాల్దీవులు), రాస్ అల్ ఖైమా (యుఎఇ)కి నేరుగా విమాన సర్వీసులను నడిపిస్తున్నది. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, నోక్ ఎయిర్, సలాం ఎయిర్, కువైట్ ఎయిర్ వేస్, లుఫ్తాన్స, థాయ్ ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్ లైన్స్ లాంటి విమానయాన సంస్థలు RGIA నుండి అంతర్జాతీయ సర్వీసులను అందిస్తున్నాయి.
Read Also: మండుటెండల్లో క్యాబ్ డ్రైవర్ల షాక్.. మళ్లీ ‘నో ఏసీ క్యాంపెయిన్’ షురూ!