Durga Puja Preparations: పశ్చిమ బెంగాల్ లో దుర్గా పూజ ఉత్సవాలకు సిద్ధమవుతున్న కోల్‌కతా నగరం కొత్త అందాలను సంతరించుకుంటోంది. పండుగ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం నగరంలోని ప్రధాన వంతెనలు, రహదారులను, కూడళ్లను రంగురంగుల డిజైన్లతో అలంకరిస్తోంది. సంప్రదాయ బెంగాలీ కళారూపమైన అల్పోనా మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పింక్, ఆరెంజ్, యెల్లో కలర్స్ తో వంతెనలకు కొత్త లుక్ తీసుకొస్తుండగా.. రోడ్లపై వేసిన కళాత్మక చిత్రాలు స్థానికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దుర్గా పూజ సందర్భంగా చేపట్టిన ఈ సుందరీకరణ కార్యక్రమంలో గరియాహట్ బ్రిడ్జితో పాటు పలు ప్రధాన ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. వంతెనల ఉపరితలాలకు ప్రకాశవంతమైన రంగులు వేస్తున్నారు. పార్క్ సర్కస్ కనెక్టర్ కింద, గరియా మోర్ లాంటి రద్దీ కూడళ్లలో పెద్ద ఎత్తున అల్పోనా డిజైన్లు గీస్తున్నారు. బెంగాలీ సంస్కృతిలో అల్పోనాకు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, శుభకార్యాల సమయంలో నేలపై బియ్యపు పిండి, ఇతర పదార్థాలతో వేసే ఈ సంప్రదాయ డిజైన్లు ఇప్పుడు నగర సుందరీకరణలో భాగమయ్యాయి. దీంతో కోల్‌కతాలోని ప్రధాన రహదారులు పండుగ కళను ప్రతిబింబిస్తున్నాయి.
గరియాహట్ వంతెన దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించిన పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్.. ఈ కార్యక్రమం సోదరభావం, ప్రేమ, ప్రజల మధ్య నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా పార్క్ సర్కస్ ప్రాంతంలో అల్పోనా డిజైన్ల రూపకల్పనలో హిందూ కళాకారులతో పాటు మైనారిటీ వర్గాలకు చెందిన కళాకారులు కూడా పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. వివిధ వర్గాల కళాకారులు కలిసి పనిచేయడం మత సామరస్యానికి మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ను ప్రస్తావిస్తూ.. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఈ కార్యక్రమంలో కనిపిస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.
మరోవైపు రహదారులు, వంతెనలకు రంగులు వేయడంపై ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు ఆరెంజ్, యెల్లో కలర్స్ వాహనదారుల దృష్టిని మళ్లించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
గరియాహట్ వంతెన, గరియా మోర్‌తో పాటు రెడ్ రోడ్ ప్రాంతంలోనూ ఇలాంటి అలంకరణ పనులు చేపట్టినట్లు మంత్రి అగ్నిమిత్ర తెలిపారు. పండుగకు ముందు హుగ్లీ నది వెంబడి ఉన్న ఘాట్లను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా దుర్గా పూజ సందర్భంగా కోల్‌కతాను మరింత అందంగా మార్చడంతో పాటు, బెంగాలీ సంప్రదాయ కళలను ప్రజలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది.
Kolkata roads and flyovers are getting painted. pic.twitter.com/PT3oYI6hEy
— 🚨Indian Gems (@IndianGems_) October 12, 2026
Read Also: వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!