భారతీయ రైల్వే ప్రయాణీకులకు తక్కువ ధరలో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు తూర్పు రైల్వే జోన్ లో ఎయిర్ కండిషన్డ్ సబర్బన్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలో ప్రయాణీకులు హాయిగా ఏసీ ప్రయాణం చేసే అవకాశం కల్పించనుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన మొదటి AC EMU రైలును ఇప్పటికే టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. సీల్దా డివిజన్ పరిధిలో ట్రయల్ వేస్తున్నారు. రెండవ AC EMU త్వరలో తూర్పు రైల్వే అందుకోనున్నట్లు తెలుస్తోంది.
టికెట్ ధర ఎంతంటే?
ట్రయల్స్ ముగిసిన తర్వాత సీల్దా- రాణా ఘాట్ మార్గంలో ఈ ఎయిర్ కండిషన్డ్ సబర్బన్ రైలును నడపనున్నారు. ఈ సర్వీసు 10 కి.మీ వరకు ప్రయాణానికి రూ.29, 11-15 కి.మీ ప్రయాణానికి రూ.37 వసూళు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నెలవారీ సీజన్ టిక్కెట్ల ధర రూ.590, రూ.780గా ఉంటాయన్నారు.
సంతోషం వ్యక్తం చేసిన తూర్పు రైల్వే
తమ పరిధిలో తొలిసారి ACAMU సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల తూర్పు రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ ఉదయ్ శంకర్ ఝా సంతోషం వ్యక్తం చేశారు. “దేశంలోని తూర్పు ప్రాంతం, తూర్పు రైల్వేలో ఎయిర్ కండిషన్డ్ సబర్బన్ రైలు సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. తీవ్రమైన వేడి నుంచి ఈ రైళ్లు సాంత్వన కలిగించనున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఈ AC ప్రయాణం చాలా ఖరీదైనదిగా ఉంటుందని ప్రయణీకులు భావించారు. కానీ, రోడ్డు మార్గాలతో పోలిస్తే ఇది దాదాపు 10 రెట్లు చౌకగా ఉంటుంది” అని ఝా తెలిపారు.
Read Also: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ, మీ ఏరియా ఉందేమో చెక్ చేసుకోండి!
ఒక్కో రైలులో 12 కోచ్ లు
ఇక ఈ ఏసీ సబర్బన్ రైళ్లు ఒక్కోటి 12 కోచ్ లను కలిగి ఉంటాయి. ఇవి స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సీల్డ్ వెస్టిబ్యూల్ గ్యాంగ్ వేల ద్వారా ఎండ్-టు-ఎండ్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. కంపార్ట్‌మెంట్ల మధ్య స్వేచ్ఛగా కదలడానికి వీలుగా ఉంటాయి. ప్రతి కోచ్ లో లోకో పైలెట్ చేత నియంత్రించబడే నాలుగు విద్యుత్తుతో పనిచేసే స్లైడింగ్ తలుపులు ఉంటాయి. మూడు సీట్ల స్టెయిన్ లెస్ స్టీల్ సీట్లు, సుమారు 1,100 మంది ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేలా వీటిని రూపొందించారు. అన్ని కోచ్ లలో CCTV నిఘా, రబ్బరు ఫ్లోరింగ్, అల్యూమినియం ఎక్స్‌ట్రూడెడ్ మాడ్యులర్ లగేజ్ రాక్‌లు, GPS-ఆధారిత సమాచార వ్యవస్థ, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి డబుల్ సీల్డ్ కిటికీలు ఉన్నాయి. “మెరుగైన సీటింగ్, గాలి ప్రసరణ ఉంటుంది. ప్రయాణీకులు ఆహ్లాదకరంగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెస్ట్, ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయని, పూర్తయిన తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయి” అని ఝా తెలిపారు.
Read Also: ఈ రైళ్లలో వెళ్తే హిమాలయాలను చూడొచ్చు.. ఎప్పటికీ మరిచిపోలేరు!