ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి విశాఖపట్నం. వైజాగ్ అనగానే సముద్రం కళ్ల ముందు కదలాడుతుంది. ఆ సముద్రం చుట్టూ ఎన్నో ఆకట్టుకునే టూరిజం స్పాట్స్ కూడా ఉన్నాయి. ఓవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంతకీ వైజాగ్ తో పాటు దాని పరిసరాల్లో చూడదగిన ప్రదేశాలు ఏం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాస్ హిల్- ఒకే చోట మూడు పవిత్ర ప్రదేశాలు
రాస్ హిల్ వైజాగ్ తప్పనిసరిగా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం ఇది. అద్భుతమైన ఆర్కిటెక్చర్, చుట్టుపక్కల బీచ్ లు, ఓడరేవు, షిప్‌యార్డులు ఆకట్టుకుంటాయి. రాస్ హిల్ తో కలిపి పక్కపక్కనే మూడు కొండలు ఉంటాయి. రాస్ హిల్ మీద చర్చి, మరో కొండమీద వేంకటేశ్వర స్వామి దేవాలయం, మరో కొండ మీద మసీదు ఉంటుంది. సూర్యోదయం సమయంలో రాస్ హిల్ మరింత అందంగా కనిపిస్తుంది. వంకరలు తిరిగిన రాస్ హిల్ దారి, నిర్మానుష్యమైన రోడ్లు ఆకట్టుకుంటాయి.
రిషికొండ బీచ్, డాల్ఫిన్ నోస్
ఇక వైజాగ్ అనగానే గుర్తొచ్చేది ఆర్కే బీచ్. అంతకంటే అందమైనది రిషికొండ బీచ్. ఒకవైపున కొండ, ఆ కొండ అంచునే ఉండే సముద్రం.. మెలితిరిగిన బీచ్ చూసేందుకు కనువిందు చేస్తుంది. ఈ బీచ్ లో ఎంత సమయం అయినా ఇట్టే గడిచిపోతుంది. ఇక విశాఖలో మరో చూడదగిన ప్రదేశం డాల్ఫిన్ నోస్ కొండ. విశాఖ సహజ రేవుగా ఉండేందుకు కారణం ఈ కొండ. చూడ్డానికి డాల్ఫిన్ ముక్కులాగే ఉంటుంది. ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం
ఇక విశాఖలో మరో పర్యటక ప్రదేశం సబ్ మెరైన్ కురుసురు. ఎన్నో చారిత్రక ఘటనలకు నిదర్శనంగా నిలిచిన కురుసురను.. విధుల నుంచి తప్పించిన తర్వాత విశాఖ బీచ్ లో ప్రదర్శనకు పెట్టారు. ప్రస్తుతం ఇదో మ్యూజికంగా కొనసాగుతోంది. విశాఖకు వచ్చిన పర్యాటకులు దీన్ని తప్పకుండా చూసేందుకు వస్తారు.
వైజాగ్ ఓల్డ్ టౌన్ కు వెళ్లాల్సిందే!
వైజాగ్ లోని చూడదగిన ప్రదేశాల్లో వైజాగ్ ఓల్డ్ టౌన్ ఒకటి. నగరం మొదట అభివృద్ధి చెందిన ప్రదేశం ఇదే. అనేక ముఖ్యమైన నిర్మాణాలకు నిలయంగా ఉంది. ఐకానిక్ టౌన్ హాల్, క్వీన్ విక్టోరియా పెవిలియన్, పూర్ణ మార్కెట్, కురుపాం మార్కెట్ ను చూడవచ్చు. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.
విశాఖ మ్యూజియం
విశాఖలో తప్పకుండా చాల్సిన ప్రదేశాల్లో విశాఖ మ్యూజియం ఒకటి. వైజాగ్ సముద్ర వారసత్వం, వలస కాలం నాటి నాణేలు, పాతకాలపు టైప్‌రైటర్లు, ఇతర పరికరాలు, రాజ చిత్రాలు, పాత ఛాయాచిత్రాలు, శాసనాలు, పేలని రెండవ ప్రపంచ యుద్ధం బాంబు షెల్స్ ఇక్కడ కనిపిస్తాయి.
‘శంకరం’ వెళ్లి రావాల్సిందే!
విశాఖ నుంచి 44 కి.మీ దూరంలో శంకరం ఉంటుంది. ఇక్కడ రెండు పురాతన బౌద్ధ ప్రదేశాలు ఉంటాయి. బోజ్జనకొండ, లింగాలకొండ. శంకరం అనేది క్రీ.శ 4, 9వ శతాబ్దాల నాటి ఒక చిన్న గ్రామం.1907లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ రియా 2,000 సంవత్సరాల పురాతన బౌద్ధ ప్రదేశం అయిన శంకరంను వెలికి తీశారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన బౌద్ధ ప్రదేశంగా కొనసాగుతోంది. లింగాలకొండ దగ్గర ఏకశిలా స్థూపాలు కూడా ఉన్నాయి.
కొండకర్ల అవాలో సూర్యాస్తమం
ఒవైపు అందమైన సరస్సు, మరోవైపు రంగురంగుల పక్షులు ఆకట్టుకుంటాయి. కొండకర్ల పక్షుల అభయారణ్యం మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేస్తుంది. వివిధ రకాల వృక్షసంపద, పక్షులు, కొండలు, స్వచ్ఛమైన గాలి ఆహా అనిపిస్తాయి. కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచి నీటి సరస్సు ఈ కొండకర్ల సరస్సు. కొండకర్ల ఆవా సుమారు 1800 ఎకరాల్లో విస్తరించి ఉంది.
Read Also: సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దేశంతో చూడాల్సిన బెస్ట్ 5 ప్లేసెస్ ఇవే!
ఇక వణికించే లంబసింగి, భీమిలి ఎర్రమట్టి దిబ్బలు, అరకు ప్రకృతి అందాలతో పాటు సింహాచలం ఆధ్యాత్మిక ప్రదేశం కూడా విశాఖ పరిసరాల్లోనే ఉంటుంది. వైజాగ్ వెళ్లిన పర్యాటకులు వీటిని కూడా తప్పకుండా దర్శించుకుంటారు.
Read Also: సముద్రం పక్క నుంచి వెళ్లే ఈ రైల్ రూట్స్ ఇండియాలో ఎక్కడున్నాయో తెలుసా?