Family Tour Goes Wrong| ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా టూర్ ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ కుటుంబానికి.. ఆ ట్రిప్ ఒక పీడకలలా మారింది. భాష కూడా రాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బాధ పడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. మంచుకొండల్లో ఆడుకోవాలనుకుంటే.. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ వివరాలేమిటో చూద్దాం.
కువైట్‌లో నివశిస్తున్న ఒక మలయాళీ కుటుంబం కొత్త సంవత్సరం కోసం వేసిన ట్రిప్ తలనొప్పులు తీసుకొచ్చింది. కొత్త ఏడాదిని కువైట్‌లో కాకుండా అందమైన కజకస్తాన్ మంచుకొండల్లో జరుపుకోవాలని ఆ కుటుంబం అనుకుంది. అంతే, న్యూఇయర్ ట్రిప్ ప్లాన్ చేసుకొని కజకస్తాన్‌లో వాలిపోయింది. అయితే అక్కడే వారి అదృష్ట దేవత మొఖం చాటేసింది. మంచుకొండల్లో ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన ఆ కుటుంబ పెద్ద జారిపడి తొడ ఎముక విరగ్గొట్టుకున్నాడు. అతని అసలు పేరు బయటకు రాలేదు. కానీ అందరూ అతన్ని ‘జే’ అని పిలుస్తారు. కుటుంబంతో కలిసి కజకస్తాన్ వెళ్లిన జే.. అక్కడి మంచుకొండల్లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తొడ ఎముక విరిగింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. అతన్ని దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిందా కుటుంబం. అతని గాయం తీవ్రమైందని, కాబట్టి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని అక్కడి డాక్టర్లు చెప్పారు. దానికి ఆ కుటుంబం సరేనని చెప్పాలనుకుంది. అదే సమయంలో ఈ కుటుంబానికి జరిగిన ఘటన గురించి తెలుసుకున్న ఒక మలయాళీ స్వచ్ఛంద సంస్థ.. వెంటనే ఆ ఆస్పత్రి వద్దకు చేరుకుంది. జేకి సర్జరీ అవసరం అని తెలియగానే.. దాన్ని కజకస్తాన్‌లో చేయించుకోవద్దని, అక్కడి మెడికల్ బిల్స్ భారీగా ఉంటాయని హెచ్చరించింది. అవసరమైతే కువైట్ తిరిగి వెళ్లడం మంచిదని, లేదంటే భారత్‌కు వెళ్లి సర్జరీ చేయించుకోవడం బెటరని సలహా ఇచ్చారు.
అది కూడా నిజమే అనుకున్న ‘జే’ కుటుంబం.. భారత్‌కు వెళ్లాలని అనుకుంది. ‘జే’ భార్య అక్కడి నుంచి భారత ఎంబసీకి వెళ్లి పరిస్థితిని వివరించింది. కానీ అక్కడి అధికారులు ఆమె పరిస్థితిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. దానికితోడు వారి భాష కూడా ఆమెకు రాకపోవడంతో కమ్యూనికేషన్ ఇంకా పెద్ద సమస్యగా మారింది. చివరకు ఆమె గోడంతా విన్న అధికారులు.. ఎయిర్ ఆస్తానా కాంటాక్ట్ నంబర్ ఇచ్చి పంపేశారు. ఆ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించిన తర్వాత ఆ కుటుంబానికి మరో పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే.. తొడ ఎముక విరిగిన ‘జే’ విమానం సీట్లో కూర్చోలేకపోయాడు. దానికితోడు అక్కడ ఉన్న ఏ ఎయిర్‌లైన్స్‌లో కూడా స్ట్రెచర్ సౌకర్యం కూడా లేదు. దాంతో ఆ కుటుంబం తిప్పలు రెట్టింపయ్యాయి.
Also Read: సమ్మర్ కి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఏపీకి 24 స్పెషల్ రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!
విమానంలో కూర్చోలేకపోతున్న ‘జే’ను భారత్ తీసుకెళ్లాలంటే ఎయిర్ అంబులెన్స్ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని ఆ కుటుంబానికి కొంతమంది సలహా ఇచ్చారు. కానీ ఎయిర్ అంబులెన్స్‌లో భారత్‌కు రావాలంటే ఏకంగా 60-70 లక్షలు ఖర్చవుతుంది. అంత ఖర్చు పెట్టడం ‘జే’ కుటుంబానికి అసాధ్యం. చివరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఒక మలయాళీ ఇంజనీరు.. తమ కంపెనీతో మాట్లాడి విమానంలో ఎనిమిది సీట్లు తొలగించి, ‘జే’ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేయించాడు. అయితే ‘జే’ను మెడికల్ ఎమర్జెన్సీ కోసం తీసుకెళ్తున్నందున ఆ కుటుంబం నుంచి ఒక ‘మెడికల్ ఎవాల్యుయేషన్’ సర్టిఫికెట్ కావాలని ఇండిగో సంస్థ అడిగింది. దాన్ని ఒక కజకిస్తాన్ డాక్టర్ రికమెండ్ చేయాలనేది రూల్. దీంతో ‘జే’ను భారత్‌కు తీసుకురావడం ఇంకా ఆలస్యమైంది.
‘జే’ కుటుంబానికి ఎదురైన అనుభవం తెలిసిన అందరూ కూడా.. ఇకపై ఎవరు విదేశీ పర్యటనలకు వెళ్లినా ‘ట్రావెల్ ఇన్సూరెన్స్’ తీసుకోవడం మర్చిపోకూడదని సలహా ఇస్తున్నారు. ఇలాంటి ఎమర్జెన్సీలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని, దానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరి మీరేమంటారు?