దేశ వ్యాప్తంగా పసుపు సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే విమానాలు, రైళ్లలో గోల్డెన్ మిల్క్(పసుపు పాలు) అందించాలని నిర్ణయించింది. త్వరలో దేశంలోని అన్ని రైళ్లు, విమానాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా స్థాపించిన పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగా రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పసుపు ఎగుమతి రూ.1,876 కోట్లు ఉండగా.. 2023 నాటికి ఏకంగా రూ. 5,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజాగా రాజమండ్రిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ (NIRCA)లో జరిగిన ‘పసుపు వాటాదారుల సమావేశం’లో గంగా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కర్కుమిన్ రకాల పంటలను పండించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. “పురుగు మందుల అవశేషాలు, అధికక లోహ కాలుష్యం ప్రపంచ మార్కెట్లలో భారతదేశ పసుపు ఎగుమతులకు ఆటంకం కలిగిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ సవాళ్లను పరిష్కరించే మార్గాలను కనిపెట్టాలి. రైతులు ఈ అడ్డంకిని అధిగమించడంలో సహాయపడాలి. మెరుగైన క్వాలిటీ పసుపు ఉత్పత్తి సాధించేలా కొత్త పద్దతులను అందుబాటులోకి తీసుకొచే ప్రయత్నం చేయాలి”అని ఆయన పిలుపునిచ్చారు.
విమానాలలో పసుపు పాలు
దేశంలో పసుపు ఉత్పత్తిని పెంచడంతో పాటు పసుపు వినియోగాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని గంగా రెడ్డి వెల్లడించారు. “విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా దేశీయ పసుపు వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైళ్లతో పాటు విమానాలలో ‘గోల్డెన్ మిల్క్’ అనే బ్రాండ్ ద్వారా పసుపు పాలను అందుబాటులోకి తీసుకురావాలని పసుపు బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది” అని ఆయన వివరించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలి!
దేశంలో పసుపు సాగులో గొప్ప వైవిధ్యం ఉందని గంగా రెడ్డి అభిప్రాయపడ్డారు. గోవా మినహా దేశ వ్యాప్తంగా ఈ పంటను పండిస్తున్నట్లు ఆయన వెల్లించారు. పసుపు సాగులో అధిక పెట్టుబడుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. వీలైనంత తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధించే వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల రైతులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని గంగా రెడ్డి తెలిపారు.
Read Also: ఏప్రిల్ 15 నుంచి రైల్వే తత్కాల్ టైమింగ్స్ మారుతున్నాయా?
అటు దేశంలో పలు రకాల పసుపు జాతులకు నిలయంగా ఉందని NIRCA డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్ అన్నారు. ఆరు రకాలు ఇప్పటికే భౌగోళిక సూచిక ట్యాగ్ ను పొందాయని వెల్లడించారు. “రాబోయే ఐదు సంవత్సరాలలో పసుపు ఎగుమతులను 1.6 లక్షల టన్నుల నుంచి 2.7 లక్షల టన్నులకు పెంచాలని NIRCA లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోబడుతున్నాయి” అని ఆయన వివరించారు.
Read Also: బుల్లెట్ రైళ్లు ముద్దుపెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? దీనికో కారణం ఉంది!