WhatsApp Local Trains Ticket: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే టికెట్ బుకింగ్ ను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. లోకల్ ట్రైన్స్ టికెటింగ్ వ్యవస్థ సౌలభ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. చాట్ ఆధారిత యాప్ ద్వారా టికెట్ల వ్యవస్థను ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ టికెటింగ్ వ్యవస్థకు సంబంధించి ఆసక్తి ఉన్న సంస్థలతో సమావేశం జరిగింది. అన్ని వివరాలు ఖరారు అయిన తర్వాత టెండర్లను ఆహ్వానిస్తామని అధికారులు వెల్లడించారు.
ముంబై లోకల్ ట్రైన్స్ లో ముందుగా అమలు
వాట్సాప్ ఆధారిత టికెట్ బుకింగ్ సేవలను ముందుగా ముంబై లోకల్ ట్రైన్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకులకు నగదు రహిత, వేగవంతమైన టికెట్లను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం 25 శాతం మంది ప్రయాణికులు ప్రస్తుతం డిజిటల్ పద్దతుల ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చాట్ ఆధారిత టికెటింగ్ పై కసరత్తు
ప్రస్తుత డిజిటల్ టికెటింగ్ వ్యవస్థతో పాటు, టికెట్ల కొనుగోలులో సౌలభ్యాన్ని పెంచడానికి చాట్ ఆధారిత టికెటింగ్ వ్యవస్థను రూపొందించే పనిలో పడింది భారతీయ రైల్వే. మెట్రో ప్రయాణీకులు మెట్రోలో టికెట్ బుకింగ్‌ల కోసం వాట్సాప్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. టికెట్ విండో దగ్గర QR కోడ్ ను స్కాన్ చేసిన తర్వాత, చాట్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. హాయ్ మెసేజ్ పంపిన తర్వాత, మీకు టికెట్ బుకింగ్ కోసం ఆప్షన్స్ అందించబడుతున్నాయి. ఆ తర్వాత, చెల్లింపు చేసి డిజిటల్ టికెట్లను పొందే అవకాశం ఉంటుంది. మెట్రో టికెట్లలో 67 శాతం టికెట్లు ఇదే పద్దతి ద్వారా బుక్ అవుతున్నాయి. అలాంటి వ్యవస్థనే ఇంకా మెరుగ్గా లోకల్ ట్రైన్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.
Read Also: మీకు తెలుసా? రాత్రిళ్లు కూడా మెట్రో రైళ్లు నడుస్తాయి, కానీ జనాలతో కాదు.. ఎందుకంటే?
మిస్ యూజ్ కాకుండా చర్యలు
UTS ద్వారా QR-ఆధారిత టికెటింగ్ వ్యవస్థను ప్రస్తుతం దుర్వినియోగం చేస్తున్నందున, కొత్త వ్యవస్థలో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు సులభంగా ఉండే వ్యవస్థను రూపొందించేందు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని కోసం చాట్ ఆధారిత టికెటింగ్ వ్యవస్థతో సహా అనేక ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. త్వరలో ముంబైలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త వ్యవస్థ సక్సెస్ అయితే, మన తెలుగు రాష్ట్రాల రైల్వే స్టేషన్లలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రైల్వే అధికారులు. ప్రస్తుతం ఈ వ్యవస్థను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
Read Also: వందే భారత్ స్లీపర్‌పై రైల్వే మంత్రి కీలక ప్రకటన.. వచ్చేది అప్పుడేనట!