రైలు టికెట్ (Train Ticket) బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా మనకు అవసరమైన తేదీల్లో టికెట్లు దొరకడం అంటే గగనమే. ఎంతో కష్టపడి రైలు టికెట్ కొనుగోలు చేసిన తర్వాత.. రైళ్లు ఆలస్యమైనా.. బోగీలో ఏసీ పనిచేయకపోయినా.. ఇతర కారణాల వల్ల ప్రయాణం నరకంగా మారుతుంది. అయితే, ఇకపై అలాంటి సమస్యలను రైల్వే (Indian Railway) సీరియస్‌గా తీసుకోనుంది. మీరు కొనుగోలు చేసిన టికెట్ మీద ఫుల్ రిఫండ్ అందివ్వనుంది. ఔనండి మీరు విన్నది నిజమే.
IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తరచుగా ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వేగంగా స్పందించాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా టికెట్ రిఫండ్ రూల్స్ కొన్ని మార్పులు చేసింది. రైల్వే తెచ్చిన ఆ మార్పులు ఏమిటీ? వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తదితర వివరాలు మీ కోసం.
ఒకప్పుడు కొద్దిగా.. ఇప్పుడు పూర్తిగా
ఒకప్పుడు రైళ్లు షెడ్యూల్‌కు తగిన వేళల్లో నడవకపోతే టికెట్ రుసుములో కొంత భాగం మాత్రమే రైల్వే తిరిగి ఇచ్చేది. అలాగే, కోచ్‌లలో ఏసీ పని చేయకపోయినా పెద్దగా చర్యలు ఉండేవి కాదు. రిఫండ్ కూడా లభించేది కాదు. అదే కోచ్‌లో చెమటలు కక్కుతూ ప్రయాణించాల్సి వచ్చేది. అయితే, ఈ పరిస్థితులు రైల్వేకి తలనొప్పిగా మారాయి. ఫిర్యాదులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ మీద పాక్షిక రిఫండ్ కాకుండా.. ఫుల్ రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని వల్ల నాణ్యమైన సేవలను అందించడం సాధ్యమవుతుందని భావిస్తోంది.
ఎన్ని గంటలు ఆలస్యమైతే ఫుల్ రిఫండ్?
కొత్త పాలసీ ప్రకారం మీరు ఎక్కాల్సిన రైలు మూడు గంటలకు పైగా ఆలస్యమైతే మీ టికెట్ మీద ఫుల్ రిఫండ్ ఇస్తారు. అలాగే మీరు బుక్ చేసుకున్న ఏసీ కోచ్‌లో ఏసీ పనిచేయకపోయినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి.
⦿ మీ టికెట్ మీద పేర్కొన్న టైమ్ నుంచి మూడు గంటలు కంటే ఎక్కువ ఆలస్యంగా రైలు చేరినట్లయితే.. టికెట్ మీద ఫుల్ రిఫండ్ పొందవచ్చు.
⦿ మీ కోచ్‌లో ఏసీ కాసేపు ఆగి మళ్లీ పనిచేస్తే ఈ రిఫండ్ వర్తించదు. రెండు గంటలు కంటే ఎక్కువ సేపు ఏసీ పనిచేయకపోతేనే రిఫండ్‌కు అప్లై చెయ్యాలి.
⦿ ఏసీ సమస్యపై 24 గంటలలోపు మీరు ఫిర్యాదు చెయ్యాలి. రిఫండ్ కోసం ధరఖాస్తు చెయ్యాలి. 24 గంటలు దాటిన తర్వాత మీ ఫిర్యాదును స్వీకరించరు.
⦿ వరదలు లేదా ఇతరాత్ర ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలు వల్ల రైళ్లు ఆలస్యంగా నడిస్తే రిఫండ్ వర్తించకపోవచ్చు.
Also Read: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి.. రైలు అక్కడికి చేరగానే.. పక్కా ప్లాన్‌తో..
ఎలా దరఖాస్తు చేయాలి?
⦿ ఈ ఫిర్యాదులను మీరు IRCTC వెబ్‌సైట్ (www.irctc.co.in) ద్వారా చేయవచ్చు.
⦿ ముందుగా మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
⦿ హోం పేజీలో కంప్లైంట్స్ లేదా రిఫండ్ కేటగిరిపై క్లిక్ చెయ్యండి.
⦿ PNR నెంబర్ నమోదు చేసిన తర్వాత మీ సమస్యను ఎంపిక చేసి.. సబ్‌మిట్ చెయ్యండి.
⦿ మీ అభ్యర్థన పరిశీలన తర్వాత రైల్వే మీ రిఫండ్‌ను వారం లేదా 10 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది.
⦿ మీది కన్ఫార్మ్ టికెట్ అయితే మాత్రమే ఈ రిఫండ్‌కు దరఖాస్తు చేసుకోగలరు. వెయిటింగ్ టికెట్లకు వర్తించదు.