Indian Railways: హోలీ పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధం అవుతోంది. హోలీ పండుగకు సొంతూళ్ల వెళ్లి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైల్వే అధికారులు న్యూఢిల్లీ- పాట్నా నడుమ ప్రత్యేక వందేభారత్ రైలును నడుపుతున్నారు. మార్చి 8న ప్రారంభం అయిన ఈ రైలు, ఈ నెల 21 వరకు నడవనుంది.
ఢిల్లీ- పాట్నా స్పెషల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఢిల్లీ- పాట్నా మధ్య ప్రయాణం కొనసాగించే వారికి ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. 1,000 కిలో మీటర్లకు పైగా దూరాన్ని ఈ రైలు కేవలం 12 గంటల్లోపు కవర్ చేయనుంది. మార్చి 14 న హోలీ పండుగకు ముందు ప్రయాణీకులు సొంతూళ్లకు వెళ్లే సమయం కావడంతో ఈ రైలుకు అధిక డిమాండ్ ను కలిగి ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
స్పెషల్ వందే భారత్ షెడ్యూల్
హోలీ స్పెషల్ ఢిల్లీ- పాట్నా వందేభారత్ రైలు (02436) ఉదయం 8:30 గంటలకు ఢిల్లీలో బయల్దేరి రాత్రి 10:30 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. అటు పాట్నా- ఢిల్లీ వందేభారత్ రైలు (02435) ఉదయం 5:30 గంటలకు బయల్దేరి రాత్రి 8:10 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలు ఘజియాబాద్, కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, వారణాసి, ఘాజీపూర్ నగరం, బల్లియా, సురైమాన్ పూర్, ఛప్రా జంక్షన్, పాటిలిపుత్ర జంక్షన్ లలో ఆగనుంది.
కీలక మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
అటు హోలీ రద్దీకి అనుగుణంగా ఢిల్లీ-పాట్నా వందేభారత్ తో పాటు కీలక మార్గాల్లో పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రైల్వే. ఢిల్లీ- హౌరా, ఖాతిపుర- హౌరా, గోరఖ్ పూర్- మహబూబ్ నగర్, అమృత్ సర్- గోరఖ్ పూర్, పాట్నా- కోల్ కతా, మాల్డా టౌన్- ఉధ్నా, గోరఖ్ పూర్ నుంచి సుంధియామౌ, లాల్ కువాన్- రాజ్ కోట్, జయనగర్- కోల్‌కతా, రక్సౌల్- హౌరా, కోల్ కతా- పూరి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
Read Also: ఇక నుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగవు, కారణం ఏంటో తెలుసా?
నార్త్ రైల్వే పరిధిలో 404 హోలీ ప్రత్యేక రైళ్లు
అటు డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో రద్దీకి అనుగుణంగా ఉత్తర రైల్వే (NR) 404 హోలీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు పాట్నా, దానాపూర్, లక్నో, సోగారియా, మాల్డా టౌన్, గోరఖ్ పూర్, గయా, అమృత్‌సర్, హౌరా, ధన్ బాద్, పూణే, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలపనున్నాయి. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లి వచ్చే ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే సంస్థ వెల్లడించింది.
Read Also: దేశంలో అత్యంత అద్భుతమైన రైల్వే వంతెనలు, చూస్తే ఆహా అనాల్సిందే!
Read Also: సమ్మర్ లో వన్ డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ సమీపంలోఅదిరిపోయే డెస్టినేషన్స్ ఇవే.!