పబ్లిక్ న్యూసెన్స్. దీనికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. తమ మాటల వల్ల, చేతల వల్ల పక్కవారికి ఇబ్బంది కలిగేలా చేయడం నేరం. అయితే ఈ నేరానికి సరైన అర్థం, నిర్వచనం లేకపోవడం వల్ల సమూహంలో కూడా చాలామంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మెట్రో రైల్ వ్యవస్థ కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఒక భాగం. ప్రస్తుతం మెట్రో ఒక ఆధునిక రవాణా వ్యవస్థ. మెట్రోలో ప్రయాణించేవారు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదో స్పష్టంగా నియమాలున్నాయి. అయితే మ్యూజిక్ ప్లే చేయడంలో మాత్రం ఈ నియమాలు వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి.
బెంగళూరులో నిషేధం..
బెంగళూరు మెట్రో రైళ్లలో పెద్ద సౌండ్ తో సాంగ్స్ ప్లే చేయడం, వీడియోలు ప్లే చేయడం నిషేధం. మెట్రో ప్రయాణీకులు సంగీతం వినడానికి హెడ్‌ఫోన్‌లు ఉపయోగించాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పెద్ద సౌండ్ తో వీడియోలు ప్లే చేసినా, ఇతరులకు ఇబ్బందులు కలిగించినా జరిమానా విధిస్తారు. కానీ ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరగకపోవడం విశేషం. 2024 సెప్టెంబర్ నుంచి 2025 మార్చి మధ్యలో 11,000 మందికి పైగా ప్రయాణికులు నిబంధనలు ఉల్లంఘించి భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. అయితే వారికి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారంతే. జరిమానాలు మాత్రం విధించలేదు. ఈ నిబంధనలకు సంబంధించి స్పష్టమైన ప్రకటనలు, వీడియోలతో బెంగళూరు మెట్రో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తుంది.
ఢిల్లీ మెట్రోలో ఇలా..
ఢిల్లీ మెట్రోలో కూడా హెడ్‌ఫోన్‌లు లేకుండా పెద్ద సౌండ్ తో సంగీతం వినడం, వీడియోలు ప్లే చేయడం నిషేధం. పెద్ద సౌండ్ తో సంగీతం వింటే నిర్దిష్ట జరిమానా లేదు కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించారనే నేరంపై, శబ్ద కాలుష్య చట్టాల ప్రకారం జరిమానాలు విధించవచ్చు. అయితే తోటి ప్రయాణికుల నుంచి ఫిర్యాదు అందితేనే మెట్రో సిబ్బంది చర్య తీసుకోడానికి వీలు ఉంటుంది.
భారతీయ రైల్వే చట్టం 1989 ప్రకారం.. రైలు బోగీల్లో పెద్ద పెద్ద సౌండ్స్ తో సంగీతం వినడం నిషేధం. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రవర్తనను శిక్షార్హం చేశారు. నేరం తీవ్రతను బట్టి రూ.500 నుంచి జరిమానా మొదలవుతుంది. ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
దుబాయ్ లో శిక్షలు..
దుబాయ్ లోని పబ్లిక్ ప్లేసెస్ లో హెడ్ ఫోన్స్ లేకుండా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినడం నేరం. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కఠినమైన నియమాలు రూపొందించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా గ్యారెంటీ. దుబాయ్ మెట్రోలో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వింటే రూ.2,300 నుంచి జరిమానా మొదలవుతుంది. నేరం తీవ్రతను, నేరం ఒప్పుకునే క్రమంలో వారి ప్రవర్తనను బట్టి ఆ జరిమానా రూ.46,000 వరకు ఉండవచ్చు.
హైదరాబాద్ మెట్రోలో..
హైదరాబాద్ మెట్రోలో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినేవాళ్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. పెద్ద సౌండ్ తో జబర్దస్త్ జోక్ లు వింటూ నవ్వుకునేవారిని కూడా చూస్తూనే ఉంటాం. వీరి వల్ల పక్కనవాళ్లు డిస్ట్రబ్ అవుతారు. అయితే మన మెట్రోలో ఇలాంటి వ్యవహారాల వల్ల గొడవలు జరగడం ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఎవరికి వారు తమకెందుకులే అని పట్టించుకోరు. హైదరాబాద్ మెట్రో నియమ నిబంధనల్లో కూడా ఇది లేదు. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినేవారికి జరిమానా విధించాలా లేదా అనేది మెట్రో నియమాల్లో చర్చించలేదు. అయితే ఎవరైనా మనకు అసౌకర్యంగా పెద్ద సౌండ్ తో వీడియోలు ప్లే చేస్తుంటే మెట్రో సిబ్బందికి మనం ఫిర్యాదు చేయవచ్చు. అధికారులకు HMR WhatsApp నెంబర్ 918341146468 కి ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు వారు ప్రయత్నిస్తారు.
ప్రయాణికులు కూడా మెట్రోలో వెళ్తున్నప్పుడు ఇతరుల ప్రైవసీని గౌరవించాలి. పెద్ద సౌండ్ తో వీడియోలు చూడటం, సెల్ ఫోన్ లో పెద్ద పెద్దగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ఇలాంటి ప్రవర్తన వల్ల ఇతరులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అందరూ ఈ నిబంధనలు పాటిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.