Indian Raiways Train Collectors: భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్ (TC) కీలక పాత్ర పోషిస్తారు. టికెట్లను చెక్ చేయడం మొదలుకొని, ప్రయాణీకులు క్రమశిక్షణగా ఉండేలా చూడటం వరకు బాధ్యత తీసుకుంటారు. ప్రయాణీకుల భద్రతపై భరోసా కల్పిస్తారు. ఇంతకీ TC ఉద్యోగం పొందాలంటే ఎలా? ఏ విద్యార్హతలు ఉండాలి? తొలి సాలరీ ఎంత ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వే టికెట్ కలెక్టర్ సాలరీ
మన దేశంలో రైల్వే టికెట్ కలెక్టర్ సాలరీ అనేది వారు పనిచేసే రైల్వే జోన్, అనుభవం సహా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. తొలిసారి TC ఉద్యోగంలో చేరినప్పుడు నెలకు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రాథమిక వేతనం, భత్యాలు, ఉద్యోగానికి సంబంధించిన ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
పే స్కేల్, గ్రేడ్‌లు
ఇండియన్ రైల్వే 7వ పే కమిషన్ ప్రకారం జీతభత్యాలను అందిస్తుంది. TC కోసం పే స్కేల్ సాధారణంగా పే కమిషన్ లెవల్ 2 లేదంటే లెవల్ 3 కిందకు వస్తుంది. లెవల్ 2 జీతం సాధారణంగా రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు ఉంటుంది. లెవల్ 3 జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. దీనికి తోడుగా అదనపు అలవెన్సులను కూడా పొందుతారు. TCలు ప్రాథమిక జీతంతో పాటు వారి ఫస్ట్ సాలరీ తగిన విధంగా ఉండేలా అనేక అలవెన్సులు ఇస్తుంది రైల్వేశాఖ. డీఏ, టీఏ, ఇంటి అద్దెకు సంబంధించిన అలవెన్స్ లు, ప్రత్యేకమైన అలవెన్స్ లు అందిస్తుంది.
TC కెరీర్, ప్రమోషన్లు
TCలకు అనుభవం పెరుగుతున్న కొద్దీ ప్రమోషన్లు రావడంతో పాటు సాలరీ పెరుగుతుంది. TC తర్వాత సీనియర్ టికెట్ కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్లు పొందుతారు. పదోన్నతులు పొందిన కొద్దీ అదనపు బాధ్యతలు పెరగడంతో పాటు ఎక్కువ జీతం లభిస్తుంది. TC లు ఓవర్ టైం ద్వారా కూడా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ఎక్కువ వర్కింగ్ అవర్స్ కారణంగా ఎక్కువ జీతం తీసుకుంటారు.
రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగం ఎలా పొందాలి?
చాలా మంది రైల్వే టికెట్ కలెక్టర్లు కావాలని భావిస్తారు. ఇంతకీ TC కావాలంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1.TCకి కావాల్సిన అర్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. కొన్ని సందర్భాల్లో 12వ తరగతి ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. నిర్దిష్ట రైల్వే జోన్, ప్రభుత్వ నియమాలను బట్టి మారవచ్చు. SC,ST,OBC, PWD అభ్యర్థులకు వయసులో సడలింపులు ఉంటాయి. భారతీయ రైల్వే నిర్దేశించిన బాడీ ఫిట్ నెస్ కలిగి ఉండాలి. మంచి కంటి చూపు, వినికిడి కలిగి ఉండాలి.
2.రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు
భారతీయ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పరీక్షల ద్వారా TCలను నియమిస్తుంది. ముందుగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే, ఈ ఉద్యోగానికి అవసరమైన ఫిట్ నెస్ టెస్ట్ చేస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణులు అయితే, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మెరిఫికేషన్ చేస్తారు. అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఉద్యోగానికి ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారిని వివిధ రైల్వే జోన్‌లకు పోస్ట్ చేస్తారు.
3.శిక్షణ
TC ఉద్యోగానికి ఎంపికైన తర్వాత శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. టికెట్ల తనిఖీ, ప్రయాణీకుల మెయింటెనెన్స్, కస్టమర్ సేవ, భద్రతా విధానాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత రైళ్లలో పని చేయడానికి పోస్ట్ చేయబడతారు.
Read Also: టికెట్ లేకుండా టీసీకి దొరికితే.. ఎంత ఫైన్ కట్టాలి? రైల్వే రూల్ ఏం చెప్తున్నాయంటే?