Malayalam Survival Thriller: మలయాళ సినిమా పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. చిన్న స్టోరీ లైన్ తో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే సినిమాలు అక్కడి నుంచి చాలానే వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏలకుల తోటలో అర్ధరాత్రి జరిగే దాడి… ప్రాణాపాయంలో ఉన్న భర్తను కాపాడుకోవడానికి ఓ భార్య చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే ‘జెన్నిఫర్’ (Jennifer). అసలు ఆ రాత్రి ఏలకుల తోటలో ఏం జరిగింది ? ఈ సినిమాను ఓటీటీ మూవీ లవర్స్ ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
జెన్నిఫర్ తన భర్తతో కలిసి సిటీ లైఫ్‌కు దూరంగా ఓ ఏలకుల తోటలో నివసిస్తుంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం మధ్య వాళ్ల జీవితం సాగిపోతుంది. అయితే ఒక అర్ధరాత్రి వారి జీవితాల్లో ఊహించని సంఘటన చోటుచేసుకుంటుంది. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి, ఆయుధాలతో వాళ్ల ఇంటిపై దాడి చేస్తారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆ దంపతులు ప్రాణాపాయంలో పడతారు. ఈ దాడిలో జెన్నిఫర్ భర్త తీవ్రంగా గాయపడతాడు. చుట్టుపక్కల కనీసం సాయం చేసే మనుషులు కూడా లేని పరిస్థితి. ఒకవైపు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్న దుండగులు… మరోవైపు మృత్యువుతో పోరాడుతున్న భర్త.
ఇలాంటి పరిస్థితుల్లో జెన్నిఫర్ ఏం చేసింది ? తన భర్తను కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ? అసలు ఆ దుండగులు ఎవరు ? ఆ దంపతులపైనే ఎందుకు దాడి చేశారు ? ఈ దాడి వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? జెన్నిఫర్ పరిస్థితులకు ఎదురొడ్డి ఎలా నిలబడింది ? తన భర్తను రక్షించుకోవడానికి ఎంతవరకు వెళ్లింది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా ఒకే రాత్రి, ఒకే ప్రాంతంలో జరిగే సంఘటనలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఒక సాధారణ మహిళ ఒక్కసారిగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ఎలా స్పందిస్తుందనే అంశాన్ని ఈ కథలో చూపించారు. సర్వైవల్ థ్రిల్లర్లు, లేడీ ఓరియెంటెడ్ కథలు ఇష్టపడేవారు ఈ సినిమాపై వెంటనే ఒక లుక్కేయండి.
మలయాళం సినిమా ‘జెన్నిఫర్’ ప్రస్తుతం మనోరమా మ్యాక్స్ (ManoramaMax) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 30 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకు అల్తాఫ్ రెహ్మాన్ దర్శకత్వం వహించారు. ఇందులో స్వాసిక (Swasika), బిను దేవ్ (Binu Dev), రారి కృష్ణ (Rari Krishna) తదితరులు నటించారు. ఈ సినిమా మలయాళం ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. వీకెండ్‌లో కొత్త తరహా మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ చూడాలనుకునేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.
Read Also: వైరస్ దెబ్బకు మనుషులంతా జాంబీలుగా మారితే… క్షణక్షణం ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్