Spanish Crime Mystery Series: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లలో ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ కథ నడుస్తుంటుంది. కానీ ఒక యువతి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, ఆమె కోసం మొదలైన వెతుకులాటలో ఒక్కొక్కటిగా బయటపడే రహస్యాలు కథను ఊహించని మలుపు తిప్పితే… ఆ ఇన్వెస్టిగేషన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇలాంటి కథాంశంతో రూపొందిన స్పానిష్ క్రైమ్ మిస్టరీ సిరీసే ‘కాల్డాస్ ఎల్ ఉల్టిమో బార్కో’ (Caldas: El Último Barco). మరి ఈ సిరీస్లో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది ? ఆ యువతి అదృశ్యం వెనుక ఉన్న రహస్యాలేంటి ? అన్నది కథలో తెలుసుకుందాం పదండి.
విగో ప్రాంతానికి చెందిన ప్రముఖ సర్జన్ కుమార్తె మోనికా ఆండ్రాడే. ఒకరోజు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకదు. దీంతో ఈ కేసును ఇన్స్పెక్టర్ లియో కాల్డాస్ చేతికి అప్పగిస్తారు. ఆయనకు సహాయకుడిగా ఎస్టెవెజ్ కూడా రంగంలోకి దిగుతాడు. మొదట్లో సాధారణంగా కనిపించిన ఈ మిస్సింగ్ కేసు… దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనేక రహస్యాలను బయటపెడుతుంది. మోనికా కనిపించకుండా పోవడానికి ముందు ఆమె జీవితం ఎలా ఉండేది ? ఆమె కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ? ఆమెకు తెలిసిన వ్యక్తుల్లో ఎవరైనా ఈ అదృశ్యం వెనుక ఉన్నారా ? అనే కోణాల్లో కాల్డాస్, ఎస్టెవెజ్ విచారణ సాగిస్తారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, బయటకు కనిపించని వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ ఒత్తిళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. కేసు గురించి మీడియా జోక్యం కూడా దర్యాప్తును మరింత ఇంటెన్స్ గా మారుస్తుంది. మరోవైపు ఈ కేసును ఛేదించే ప్రయత్నంలో ఇన్స్పెక్టర్ కాల్డాస్ తన గతానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మోనికా ఏమైంది ? ఆమె అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు ? ఈ కేసులో బయటపడే రహస్యాలకు, కాల్డాస్ గతానికి ఉన్న సంబంధం ఏంటి ? ఒక మిస్సింగ్ కేసు చుట్టూ మొదలైన విచారణ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
‘కాల్డాస్ ఎల్ ఉల్టిమో బార్కో’ సిరీస్ను డొమింగో విల్లార్ (Domingo Villar) ఇదే పేరుతో రాసిన పాపులర్ క్రైమ్ నవల ఆధారంగా రూపొందించారు. ఈ సిరీస్లో ఇన్స్పెక్టర్ లియో కాల్డాస్గా జేవియర్ గుటియెరెజ్ (Javier Gutiérrez), అతని సహాయకుడు ఎస్టెవెజ్గా హోవిక్ క్యూకెరియన్ (Hovik Keuchkerian) నటించారు. మరియా పుజాల్టే (María Pujalte), ఆంటోనియో మౌరెలోస్ (Antonio Mourelos), అలెజాండ్రా ఒనీవా (Alejandra Onieva), మిర్యామ్ గాలెగో (Miryam Gallego) తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. జార్జ్ సావేద్రా (Jorge Saavedra) దర్శకత్వం వహించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లతో రూపొందిన ఈ స్పానిష్ సిరీస్ అక్టోబర్ 30న Jio Hotstarలో ఇంగ్లీష్ ఆడియోతో విడుదలైంది.