Hyderabad Metro TUTEM App: ప్రయాణీకుల భద్రత కోసం హైదరాబాద్ మెట్రో కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే మహిళా ప్రయాణీకుల భద్రత మరింత పెంచేలా సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్‌హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ(TUTEM) యాప్ ను పరిచయం చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL).. BITS పిలాని హైదరాబాద్ క్యాంపస్, , హైదరాబాద్ పోలీస్, IIT ఖరగ్‌పూర్, IIT బాంబే సహకారంతో TUTEM యాప్‌ను అభివృద్ధి చేసింది. ఇది మహిళా ప్రయాణీకులు మెట్రో ప్రయాణానికి ముందు, తర్వాత అంటే.. ఇంటి నుంచి బయల్దేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు సురక్షితంగా వెళ్లేలా సాయపడుతుంది. మహిళల భద్రతే లక్ష్యంగా TUTEM అనే కొత్త యాప్ ను అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ వెల్లడించింది.
త్వరలో అందుబాటులోకి TUTEM యాప్
ఇక ఈ అత్యాధునిక భద్రతా యాప్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్లు HMRL మేనేజింగ్ డైరెక్టర్ N V S రెడ్డి వెల్లడించారు.”హైరాబాదీల ప్రయాణంలో ఎక్కువ భాగం మెట్రో రైలు ద్వారానే కొనసాగుతోంది. ఇంటి నుంచి మొదలుకొని తుది గమ్యస్థానానికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ యాప్ తీసుకొచ్చాం. మెట్రోలో మాత్రమే కాదు, నడక, ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, ఆటోలు లాంటి వాటిని కూడా కవర్ చేస్తుంది. మెట్రో ప్రయాణాలకు ముందు, తర్వాత ప్రయాణాలను కూడా కవర్ చేయడానికి ఈ యాప్ రూపొందించబడింది” అని బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో జరిగిన యూజర్ వర్క్ షాప్ లో N V S రెడ్డి వివరించారు. .
TUTEM యాప్ ఎలా పని చేస్తుందంటే?
TUTEM యాప్ లో డ్రైవర్ యాప్, యూజర్ యాప్ అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ యాప్ ద్వారా ప్రయాణీకులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. మహిళా ప్రయాణీకులు తమ ప్రయాణంలో ఏ సమయంలోనైనా సేఫ్ గా లేము అని భావిస్తే, పోలీసు కంట్రోల్ సెంటర్, వారి కుటుంబ సభ్యులు, బంధువులను వెంటనే అప్రమత్తం చేసే సౌకర్యాలను యాప్ లో పొందు పరిచినట్లు N V S రెడ్డి తెలిపారు.
అర్థరాత్రి వేళల్లోనూ మహిళలకు భద్రత
అర్థరాత్రి వేళల్లో కూడా మహిళల భద్రతను నిర్ధారించడానికి TUTEM యాప్ లో అనేక ఫీచర్లను చేర్చినట్లు BITS పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు తెలిపారు. ఈ చొరవను హైదరాబాద్‌లోనే కాకుండా భవిష్యత్తులో ఇతర మెట్రో నగరాలకు విస్తరించడానికి తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ADB ప్రతినిధి జోసెఫిన్ అక్వినో, BITS పిలానీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌమ్యో ముఖర్జీ, IIT బాంబే ప్రొఫెసర్ అవిజిత్ మాఝి, BITS పిలానీ ప్రొఫెసర్ ప్రశాంత్ సాహు పాల్గొన్నారు.
Read Also: హైదరాబాద్ లో ట్రాఫిక్ డైవర్షన్స్, మీ ప్రాంతాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!