Araku Train Route History: అరకు రైలు ప్రయాణం అనగానే పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, చుట్టూ ప్రకృతి అందాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా రైలు ప్రయాణంలో కనిపించే సొరంగాలు, ఎత్తైన వంతెనలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే, ఈ అందమైన రైల్వే మార్గం వెనుక చాలా మందికి తెలియని ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. ఈ మార్గం నిర్మాణం అసలు మన కోసం కాకుండా జపాన్ కోసం నిర్మించారంటే ఆశ్చర్యం కలగకమానదు. అసలు జపాన్‌కు మన అరకు రైల్వే మార్గంతో సంబంధం ఏంటి? ఈ రైలు మార్గం ఎలా ఏర్పడింది? అంటే..
1960వ దశకంలో జపాన్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలయ్యింది. అక్కడి ఉక్కు పరిశ్రమలకు భారీగా ఇనుప ఖనిజం అవసరం అయ్యింది. అప్పుడే జపాన్ ఫోకస్ ఇండియా వైపు మళ్లింది. దేశంలో అద్భుతమైన ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిలా ప్రాంతంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు కనిపెట్టింది. ఈ ఖనిజాన్ని జపాన్‌కు ఎగుమతి చేయాలంటే గనుల నుంచి సముద్ర తీరానికి రవాణా చేసే సౌకర్యం అవసరమైంది. ఈ నేపథ్యంలోనే బైలాడిలా నుంచి విశాఖపట్నం పోర్టుకు ఇనుప ఖనిజాన్ని తరలించే రైల్వే మార్గానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రవాణా వ్యవస్థలో కిరండూల్-కొత్తవలస రైల్వే మార్గం కీలకంగా మారింది.
బైలాడిలా నుంచి విశాఖపట్నం వరకు రైల్వే లైన్ వేయడం అంత ఈజీ కాదు. మధ్యలో తూర్పు కనుమలు (Eastern Ghats) అడ్డుగా ఉన్నాయి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, దట్టమైన అడవుల మధ్య రైల్వే మార్గాన్ని నిర్మించాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొండలను తొలిచి ఏకంగా 58 సొరంగాలు నిర్మించారు. అంతేకాదు, లోయలను దాటేందుకు 84 పెద్ద వంతెనలను ఏర్పాటు చేశారు. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో రైల్వే లైన్ నిర్మించడం అప్పట్లో ఇంజినీర్లకు పెద్ద సవాలుగా మారింది.
ఈ రైల్వే మార్గం నిర్మాణంలో జపాన్ సహకారం కూడా కీలకంగా నిలిచింది. బైలాడిలా ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టుకు తరలించి, అక్కడి నుంచి జపాన్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ఈ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశారు. కిరండూల్-కొత్తవలస రైల్వే లైన్ ఈ అవసరాన్ని తీర్చడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చి దాదాపు ఆరు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తగ్గలేదు. బైలాడిలా గనుల నుంచి వెలికితీసిన ఇనుప ఖనిజాన్ని రైళ్ల ద్వారా విశాఖపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, ఈ రైల్వే మార్గం కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితం కాలేదు. నెమ్మది నెమ్మదిగా ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అరకు మీదుగా కిరండూల్ వరకు వెళ్లే రైలు ప్రయాణం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. అందుకే అరకు రైల్వే మార్గం కేవలం ప్రకృతి అందాలను చూపించే ప్రయాణం మాత్రమే కాదు.. భారత పారిశ్రామిక చరిత్రను, ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని గుర్తుచేసే అద్భుత నిర్మాణంగా చెప్పుకోవచ్చు.
Read Also: కిటికీలో నుంచి చూస్తే స్వర్గమే.. జీవింతంలో ఒక్కసారైన చూడాల్సిన 5 అద్భుతమైన రైలు మార్గాలు!