Indian Railways Kavach System: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 2020లో ఈ వ్యవస్థను ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్(ATP)గా రైల్వే సంస్థ స్వీకరించింది. తొలిసారి 2023లో దక్షిణ మధ్య రైల్వేలోని 1,465 రూట్ కి.మీ పరిధిలో అమలు చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. ‘కవచ్’ పనితీరు, ఆప్టిమైజేషన్ గురించి అవగాహనను పెంపొందించడానికి రైల్వే భద్రతా నిపుణులకు ఇంతకాలం ఉపయోగపడుంది. తాజాగా ‘కవచ్’కు సంబంధించి రూల్స్ ను ఫ్రేమ్ చేసింది రైల్వేశాఖ. ఈ మేరకు జనవరి 2న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం, 1989 రైల్వే చట్టంలో ‘కవచ్’ను చేర్చుతూ సవరణ చేసింది. ‘కవచ్’ పనితీరు, భద్రతకు సంబంధించి బోర్డు విడిగా కొత్త నియమాలను రూపొందించింది. జనవరి 20, 2025న రైల్వే బోర్డు ‘కవచ్’ గెజిట్ ను అన్ని జోన్లు, సంబంధిత విభాగాలకు పంపింది.
గెజిట్ నోటిఫికేషన్ లో ఏం ఉందంటే?
“ఇండియన్ రైల్వే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (IR-ATP- కవచ్) అనేది రేడియో కమ్యూనికేషన్ ఆధారిత నియంత్రణ వ్యవస్థ. ఫంక్షనల్ ‘కవచ్’ అమర్చిన లోకోమోటివ్‌ల లోకో పైలట్లకు అదనపు సహాయంగా ఉంటుంది. లోకో పైలట్ అనుసరించాల్సిన సాధారణ రైలు ఆపరేషన్ నిబంధనలను ఏ విధంగానూ ఉల్లంఘించదు” అని ‘కవచ్’ను గురించి నోటిఫికేషన్ లో వెల్లడించింది. రైల్వే చట్టంలో ‘కవచ్’ అర్థాన్నివివరించడంతో పాటు, కొత్త నియమాలను కూడా రూపొందించారు అధికారులు. ఇందులో సిగ్నల్స్, వేగ పరిమితులు, కవచ్ వ్యవస్థతో పనిచేసే ప్రాంతంలో ప్రమాదాలు, అడ్డంకుల సమయంలో స్టేషన్ మాస్టర్ పాత్ర గురించి వివరించారు. “‘కవచ్’ ప్రాంతంలోని స్టేషన్ మాస్టర్‌కు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇతర రైళ్లు ప్రభావిత విభాగంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి స్టేషన్ మాస్టర్ ఆపరేషనల్ ప్యానెల్ కమ్ ఇండికేషన్ ప్యానెల్ లో SOSను నిర్వహించాలి. అటు ‘కవచ్’ ప్రాంతంలో ప్రయాణం ప్రారంభించే ముందు, లోకో పైలట్ ఆన్-బోర్డ్ కవచ్‌ను బూట్ చేయాలి. రైలు కాన్ఫిగరేషన్‌ను నమోదు చేయాలి. అన్ని పారా మీటర్స్ సరిగ్గా సూచించబడ్డాయో లేదో చూడాలి” అని వెల్లడించారు. ఇక ఈ గెటిజట్ నోటిఫికేషన్, ‘కవచ్’ రూల్స్ ను సంబంధించి రైల్వే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలనని రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్‌ల జనరల్ మేనేజర్లు, సంబంధిత ఇతర అధికారులకు లేఖ రాసింది.
ఇక “’కవచ్’ పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవస్థ కాదు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడుతుంది. వ్యవస్థను ఆప్టిమైజ్ చేయడానికి కొంత సమయం, ఎక్స ర్ సైజ్ అవసరం. అందుకే 2 ఏండ్ల తర్వాత రైల్వే బోర్డు రూల్స్ ఫ్రేమ్ చేసింది” అని రైల్వే మాజీ చీఫ్ సిగ్నల్, టెలికాం ఇంజనీర్ కె పి ఆర్య వెల్లడించారు.
‘కవచ్’ గురించి..
‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి తీసుకొచ్చిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీనిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) స్వదేశీ టెక్నాలజీతో రూపొందిస్తున్నది. ‘కవచ్’ అనేది లోకో పైలట్లు సిగ్నల్-పాసింగ్‌ను నివారించడంలో సహాయపడటమే కాకుండా దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలో రైలు నడపడంలో సహాయపడుతుంది. రైలు భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 523 రైల్వే స్టేషన్లలో కవచ్ ఏర్పాటు చేశారు. శరవేగంగా విస్తరిస్తున్నారు.
Read Also: భారతీయ రైల్వేలో అన్ని క్లాస్ లు ఉంటాయా? ఒక్కో క్లాస్ టికెట్ రేటు ఎంత ఉంటుందో తెలుసా?