Night Train Travel Rules: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులు రైలులో ప్రయాణిస్తున్నారు. కొందరు తక్కువ దూరం ప్రయాణిస్తారు. మరికొందరు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. కొంతమంది పగటి పూట ప్రయాణాన్ని ఇష్టపడతారు. మరికొంత మంది రాత్రి ప్రయాణాన్ని ఇష్టపడుతారు. రైలు ప్రయాణం సజావుగా కొనసాగేందుకు భారతీయ రైల్వే పలు నియమ నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని పాటించడం వల్ల ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇవి రాత్రి 10 గంటల నుంచి అమలు అవుతాయి. వాటిని ఉల్లంఘించడం వల్ల జరిమానాలతో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రాత్రిపూట ప్రయాణీకులు పాటించాల్సిన రూల్స్
రాత్రిపూట ప్రయాణ సమయంలో మీ ఫోన్ లో లౌడ్ స్పీకర్ పెట్టి పాటలు వినడం, గట్టిగట్టిగా మాట్లాడ్డం లాంటివి చేయకూడదు. రైల్వే కోచ్ లలో రాత్రివేళ నైట్ లైట్ మినహా అన్ని లైట్లను ఆపివేయాలి. మిడిల్ బెర్త్ లో ఉన్న ప్రయాణీకుడు రాత్రి 10 గంటల తర్వాత నిద్రపోవాలనుకుంటే, లోయర్ బెర్త్ లో ఉన్న ప్రయాణీకుడు అభ్యంతరం లేకుండా వారిని అనుమతించాల్సి ఉంటుంది.
రాత్రి 10 తర్వాత నో చెకింగ్!
ఇక రాత్రి 10 గంటల తర్వాత టికెట్ ఎగ్జామినర్ (TTE) కూడా టికెట్లను చెక్ చేయరు. రాత్రి 10 గంటల కంటే ముందే చెకింగ్ కంప్లీట్ చేస్తారు. రైల్వే నింబంధనల ప్రకారం, TTEలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టికెట్లను చెక్ చేయరు. ఈ సమయంలో టికెట్లను చెక్ చేయడం వల్ల ప్రయాణీకుల నిద్రకు ఇబ్బంది కలుగుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రాత్రి 10 గంటల తర్వాత ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అందించే ఫుడ్ అంత నమ్మదగినదిగా ఉండకపోవచ్చు. రాత్రిపూట ప్రయాణం కోసం మీరు ఇ-క్యాటరింగ్ సేవ ద్వారా ఆహారం లేదంటే స్నాక్స్ ను ముందస్తుగా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ రూల్స్ ను గుర్తుంచుకోవాలి.
మద్యం తాగుతూ పట్టుపబడితే జైలు శిక్ష
రాత్రి సమయాల్లో చాలా మంది ఒకేచోట గుమిగూడటం, అంతా కలిసి ఇతరులకు ఇబ్బంది కలిగేలా మాట్లాడ్డం లాంటివి చేయకూడదు. కొంత మంది రాత్రిపూట మద్యం సేవిస్తుంటారు. అలా చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఒకవేళ మద్యం తాగుతూ రైల్వే పోలీసులకు పట్టుపడితే కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. తోటి ప్రయాణీకులు మీ నిద్రకు ఇబ్బంది కలిగిస్తే TTEకి లేదంటే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సో, ప్రతి ప్రయాణీకుడు రాత్రిపూట కచ్చితంగా రైల్వే రూల్స్ ను పాటించాల్సి ఉంటుంది.
Read Also: పట్టాలు ఎక్కబోతున్న ఫస్ట్ హైడ్రోజన్ రైలు, అసలు విషయం చెప్పిన రైల్వే అధికారులు!