Indian Railways Rule: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్యాసింజర్లు రైలు ఎక్కాల్సిన స్టేషన్ దాటిన తర్వాత 10 నిమిషాల లోపు సీటులో కూర్చోవాలని.. లేదంటే సీటు క్యాన్సిల్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్దాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఒక రైలు స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత సీట్ల కేటాయింపులో రైల్వే సంస్థ కీలక మార్పులు చేసిందని వార్తలు వెలువడ్డాయి. కొత్త రైల్వే రూల్స్ ప్రకారం, రైలు స్టేషన్ నుంచి బయల్దేరిన 10 నిమిషాల్లోపు నిర్దిష్ట ప్రయాణీకులు తమ సీట్లలో కూర్చోకపోతే వారి సీటు క్యాన్సిల్ చేసే అధికారం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, సదరు సీటును వేరొక ప్యాసింజర్ కు కేటాయించే అధికారం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. ప్రయాణీకులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ అంశంపై స్పందించారు. 10 నిమిషాల్లో ప్రయాణీకులు సీట్లో కూర్చోకపోతే సీటు క్యాన్సిల్ అవుతుందనే వార్తలపై వివరణ ఇచ్చారు.
రైల్వే అధికారులు ఏం చెప్పారంటే?
10 నిమిషాల్లో సీట్లో కూర్చోకపోతే సీటు క్యాన్సిల్ అవుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం అంతా అబద్దం అన్నారు. హ్యాండ్ హెల్డ్ టెర్మినల్ అనే నోట్ ప్యాడ్ TTEలకు పంపిణీ చేయడం వల్ల 10 నిమిషాల చర్చకు సంబంధించిన అపోహలు పెరిగాయన్నారు. గతంలో TTEలకు ఒక షీట్ ఇచ్చేవారు. దానిలో ప్రయాణీకులు ఎక్కారా? లేదా? అనే విషయాన్ని రాసేవాళ్లు. ఇప్పుడు ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసేందుకు ఇదే పద్దతిని ఉపయోగిస్తున్నారు. రైలు స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత TTE సీటు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా 10 నిమిషాలు సీట్లో లేకపోతే, సీటు ఖాళీగా ఉన్నట్లు గుర్తిస్తారు. అయితే, 10 నిమిషాల్లో ప్రయాణీకులు సీట్లలో కూర్చోకపోతే సీటు క్యాన్సిల్ అవుతుందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు రైల్వే అధికారు.
TTE అరగంట తర్వాత సీటు దగ్గరికి వచ్చే అవకాశం!
నిజానికి రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన దాదాపు అరగంట తర్వాత TTE ప్రయాణీకుల సీటు దగ్గరికి వస్తారు. ఆ తర్వాత కూడా 10 నిమిషాల పాటు సీటులో లేకపోతే సీటు ఖాళీగా ఉన్నట్లు గుర్తిస్తారు. అంటే TTE రావడానికి 30 నిమిషాలు, అతడు వచ్చిన తర్వాత మరో 10 నిమిషాలు.. మొత్తంగా 40 నిమిషాల పటు ప్రయాణీకుడు సీటులో లేకపోతే ఖాళీగా ఉన్నట్లు భావించి, మరో ప్రయాణీకుడికి సీటు కేటాయించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు 10 నిమిషాల్లో సీటులో లేకపోతే, సీటు క్యాన్సిల్ అవుతుందనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు రైల్వే అధికారులు.
Read Also: రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందూ టికెట్ బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా చేయండి!