Restricts Sale Of Platform Tickets: దేశ వ్యాప్తంగా హోలీ సంబురాలు మొదలయ్యాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి రంగుల్లో మునిగి తేలుతున్నారు. ఎక్కడ చూసినా ఒకరిపై మరొకరు రంగులు పూసుకుంటూ సరదా సరదాగా గడుపుతున్నారు. రెయిన్ డ్యాన్సులు, డ్రమ్స్ మోతల నడుమ కోలాహలంగా హోలీ వేడుకలు జరపుకుంటున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో రంగుల పండుగ ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటున్నారు.
హోలీ వేళ రైల్వే కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా హోలీ జరుపుకుంటున్న నేపథ్యంలో.. ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించడానికి భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. దేశ వ్యాప్తంగా సుమారు 400 పైగా రైళ్లు సర్వీసులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని కంట్రోల్ చేసేందుకు తగిన చర్యలు చేపట్టింది. ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కీలక రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు పరిమితం
ముఖ్యంగా ముంబై డివిజన్ పరిధిలోని కీలక రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలను పరిమితం చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే (WR) వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. మార్చి 16 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించింది. “ముంబై డివిజన్ లోని ముంబై సెంట్రల్, బాంద్రా టెర్మినస్, వాపి, వల్సాద్, ఉధ్నా, సూరత్ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్లు అందుబాటులో ఉండవు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, ప్రత్యేక సపోర్టు అవసరం ఉన్నప్రయాణీకులకు సహాయం చేసే వ్యక్తులకు మినహాయింపు ఉంటుంది. ఇతర స్టేషన్లలోనూ పరిమిత సంఖ్యలో ప్లాట్‌ఫామ్ టికెట్లను విక్రయిస్తాం” అని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో కీలక నిర్ణయాలు
కుంభమేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులు మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇండియన్ రైల్వే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 60 రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్స్ మీద రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నది.
Read Also: 60 స్టేషన్లలో కొత్త విధానం అమలు, ఇలా చేస్తే మీకు నో ఎంట్రీ!
ఇక పండుగల సమయంలో సజావుగా, సురక్షితంగా రైల్వే కార్యకలాపాలను కొనసాగించేందుకు అదనపు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని ఇతర స్టేషన్లలో పరిమితులను విధించింది. హోలీ వేళ రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. తాజాగా నిబంధనలు లోబడి నడుచుకోవాలన్నారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ చర్యలను చేపట్టినట్లు వివరించారు. అందరూ సురక్షితంగా ప్రయాణం చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు.
Read Also: ఇక ఆ రైళ్లన్నీ చర్లపల్లి నుంచే, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, కారణం ఏంటంటే?