Big Tv Originals: రైల్వే ప్రయాణం చేసే వారికి కామన్ గా వినిపించే పదం PNR నెంబర్. చాలా మంది దీని గురించి తెలియదు. ఈ నెంబర్ వల్ల కలిగే లాభాల గురించి కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు మనం PNR నెంబర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. PNR అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్. ఇది బుక్ చేసుకున్న ప్రతి రైలు టికెట్ కు కేటాయించబడిన ప్రత్యేకమైన 10 అంకెల సంఖ్య. ఎక్కడ టికెట్ బుక్ చేసుకున్నా ఈ నెంబర్ అనేది కేటాయిస్తాయి. ఈ నంబర్ ప్రయాణీకుల వివరాలు, టికెట్ స్టేటస్ ను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఇంతకీ PNR నెంబర్ ఉద్దేశం ఏంటి?
భారతీయ రైల్వే ప్రయాణంలో PNR నెంబర్ కు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీని ద్వారా చాలా లాభాలున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం..
⦿ టికెట్ కన్ఫర్మేషన్ స్టేటస్:
ప్రయాణీకులు తమ టికెట్ కు సంబంధంచి రియల్ టైమ్ స్టేటస్ ను తనిఖీ చేయడంలో సాయపడుతుంది. టికెట్ ధృవీకరించబడిందా? వెయిట్ లిస్ట్ చేయబడిందా? రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్ కింద ఉందా? అనే విషయాలను వెల్లడిస్తుంది.
⦿ ప్రయాణ సమాచార వివరాలు:
PNR నెంబర్ అనేది ప్రయాణీకుల పేర్లు, రైలు నంబర్, సీటు/బెర్త్ వివరాలు, ప్రయాణ తేదీ, బోర్డింగ్, దిగాల్సిన స్టేషన్, చెల్లింపు సహా ఇతర కీలక సమాచారాన్ని అందిస్తుంది.
⦿ ప్రయాణ ట్రాకింగ్ సౌలభ్యం:
ప్రయాణికులు PNR నెంబర్ ద్వారా రైలు షెడ్యూల్, బోర్డింగ్ పాయింట్లు, సీట్ల కేటాయింపు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ ఆన్‌లైన్ టికెట్ వెరిఫికేషన్:
IRCTC ద్వారా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే ఫిజికల్ టికెట్లు ఇవ్వరు. PNR వర్చువల్ టికెట్ ఐడెంటిఫైయర్ గా పనిచేస్తుంది.
PNR నంబర్ ఎలా క్రియేట్ అవుతుంది?
ప్రయాణీకుడు ఆన్‌లైన్‌లో లేదదంటే రైల్వే కౌంటర్‌లో రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, PNR నంబర్‌ను ఇండియన్ రైల్వేస్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఇది డేటాబేస్ లో ఎన్‌కోడ్ చేయబడిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా క్రియేట్ చేయబడుతుంది.
PNR నెంబర్ లోని 10-అంకెలు ఏం సూచిస్తాయి?
మొదటి 3 అంకెలు: టికెట్ బుక్ చేయబడిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ని సూచిస్తుంది. ఇది జోన్, ప్రాంతీయ రైల్వే విభాగం వివరాలను తెలియజేస్తుంది.
చివరి 7 అంకెలు: రైలు వివరాలు, ప్రయాణ తేదీ, సీటు కేటాయింపు సహా ఇతర వివరాలను సూచిస్తాయి.
PNR నంబర్ ఉపయోగాలు
టికెట్ స్టేటస్ తనిఖీ: ప్రయాణీకులు వారి రైలు టికెట్ స్టేటస్ ను తెలుసుకునేందుకుఈ నెంబర్ ను ఉపయోగించుకోవచ్చు.
టికెట్ పునరుద్ధరణ: ఒకవేళ టికెట్‌ను పోగొట్టుకుంటే, రైల్వే సిబ్బందికి PNR నంబర్ ను చెప్పి, మీ బుకింగ్ టికెట్ ను పొందే అవకాశం ఉంటుంది.
ప్రయాణ సహాయం: ప్రయాణీకులు PNRని ఉపయోగించి రైలు షెడ్యూల్‌లు, బోర్డింగ్ స్టేషన్ సహా ఇతర ప్రయాణ వివరాలను ట్రాక్ చేసుకోవచ్చు.
ప్రయాణ సమయంలో ఎవైనా ఇబ్బందులు తలెత్తితే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా PNR నెంబర్ ను చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా రైల్వే ప్రయాణంలో ఈ నెంబర్ చాలా కీలకంగా పరిగణించాల్సి ఉంటుంది.
Read Also: ఆ టికెట్లను ఆన్‌లైన్‌లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్